అత్యాధునిక హంగులతో తెలంగాణ నూతన సచివాలయాన్ని ఏడాది కాలంలో పూర్తిచేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పాత భవనాల కూల్చివేత పూర్తికావడంతో కొత్త నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది.
కొత్త సచివాలయ సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకొంది. టెండర్ నోటిఫికేషన్లో ఈ మేరకు గడువును పేర్కొంది. 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వచ్చే నెల 1 వరకు టెండర్ దాఖలుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం అదే రోజు సాంకేతిక బిడ్లను తెరవనుంది. టెండర్ దాఖలు చేసిన తర్వాత ఆర్థిక బిడ్లను వచ్చే నెల 5న తెరుస్తారు. ఈనెల 26న ప్రీబిడ్ సమావేశం జరగనుంది. 500 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ నిర్మాణం కోసం బిడ్ దాఖలు చేసే కంపెనీ టర్నోవర్ 750 కోట్లు ఉండాలని, గత ఐదేళ్లుగా ఎలాంటి నష్టాలు వాటిళ్లరాదని స్పష్టం చేసింది.
సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణ క్రమంలో పర్యావరణ సమతుల్యత పాటించాలని సర్కారు షరతులు పెట్టింది. అక్కడ ఇప్పటికే ఉన్న భారీ వృక్షాలను తొలగించరాదని తెలిపింది. నిర్మాణ సమయంలోనూ చెట్లకు నష్టం వాటిళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. నిర్మాణం కోసం అవసరమైతే సంబంధిత ఇంజినీర్ అనుమతితోనే తొలగింపు లేదా తరలించాల్సి ఉంటుందని ఇందుకయ్యే వ్యయాన్ని సంబంధిత కాంట్రాక్టర్ భరించాల్సి ఉంటుందని పేర్కొంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. టెండర్లు పూర్తి కాగానే నిర్మాణ సంస్థ త్వరలోనే పనులు ప్రారంభించనుంది.