Telangana Government Took Action: కరోనా పేరుతో దోపిడీకి పాల్పడుతున్న ఆస్పత్రులపై చర్యలు
Telangana Government Took Action: ప్రైవేటు ఆస్పత్రుల దందాపై సర్కారు ఆపరేషన్ మొదలు పెట్టింది. నిబంధనలు అతిక్రమించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై నిఘా పెట్టిన ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఇప్పటివరకు రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్స్ రద్దు చేసింది ప్రభుత్వం. డెక్కన్ ఆస్పత్రిపై మొన్న వేటు పడగా తాజాగా బంజారాహిల్స్ లోని విరించి హాస్పిటల్ పై సర్కారు వేటు వేసింది.
కరోనా ట్రీట్‌మెంట్‌ను క్యాష్ చేసుకుంటోన్న ప్రైవేట్ ఆస్పత్రులపై సర్కార్ కొరడా ఝుళిపిస్తోంది. బిల్లులతో జనాల్ని దోచుకుంటున్న ఆస్పత్రులపై చర్యలు మొదలు పెట్టింది. మానవత్వం మరిచి లక్షల రూపాయలు వసూలు చేసిన హైదరాబాద్ లోని డెక్కన్, విరించి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డెక్కన్ హాస్పిటల్‌లో ఒకే ఫ్యామిలీ కి చెందిన ముగ్గురు కరోనా తో చనిపోగా ట్రీట్మెంట్ పేరుతో లక్షలు వసూలు చేసింది ఆస్పత్రి యాజమాన్యo. పాతిక లక్షల రూపాయలు చెల్లించాలని పట్టుబట్టి ఆ కుటుంబాన్ని ఆస్పత్రి నిర్వాహకులు వేధించారు. మరోపక్క విరించి ఆస్పత్రిపై కూడా ఫిర్యాదులు రావటంతో ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నారు.
ఇకపై డెక్కన్, విరించి ఆస్పత్రుల్లో కొత్త కరోనా కేసులు అడ్మిట్ చేయటానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ల నుంచి ప్రభుత్వం సూచించిన ధరలను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోపక్క కరోనా ట్రీట్మెంట్ ను వ్యాపారం లా చూడొద్దని ప్రయివేట్ ఆస్పత్రులకు మంత్రి ఈటల హితవు పలికారు. నగరంలో అధిక ఫీజులు వసూలు చేస్తోన్న 15 ఆస్పత్రులపై ఫిర్యాదులు అందాయని రూల్స్ బ్రేక్ చే్స్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన వెంటనే వరుసగా రెండు హాస్పిటల్స్ పై వేటు పడింది. మరి ఇకనైనా హిట్ లిస్ట్ లో ఉన్న హాస్పిటళ్లు పద్ధతి మార్చుకుంటాయా అనేది చూడాలి మరి.