Fever Survey: తెలంగాణలో మరోసారి ఫీవర్ సర్వే
Fever Survey: థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా సన్నద్ధమవుతోంది.
Fever Survey: థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా సన్నద్ధమవుతోంది. ఏ వేరియంట్ వచ్చినా కట్టడి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి ఫీవర్ సర్వేను నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పాజిటివ్ రేటు తగ్గని జిల్లాల్లో వైద్య బృందం పర్యటించాలని, శాస్త్రీయ పద్దతుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సూచించారు సీఎం.
దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారన్నారు సీఎం కేసీఆర్. ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పుడొస్తుందో ఎందుకు వస్తుందో ఎంతవరకు విస్తరిస్తుందో ఏమీ తెలియడంలేదన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కట్టడికి కొత్త మార్గాలను అనుసరించడం, వేవ్‌ల రూపంలో వస్తున్న కోవిడ్ నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ప్రజలను రక్షించుకునే చర్యలను చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో వైద్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మూడ్రోజుల పాటు పర్యటించనున్నారు. జిల్లాల్లో కరోనా విస్తరించడానికి గల ప్రధాన కారణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, నివేదిక ద్వారా కేబినెట్‌కు సమర్పించనున్నారు.