Basti Dawakhana: హైదరాబాద్ లో మరో 26 దవాఖానాలు.. కరోనా సేవలు మరింత విస్త్రుతం

Basti Dawakhana: హైదరాబాద్ నగరంలో కరోనా బారిన పడ్డ రోగులకు మరింత వేగంగా వైద్య సేవలందించేందుకు తెలంగాణా ప్రభుత్వం సంకల్పించింది.

Update: 2020-08-12 02:16 GMT
Basti Dawakhana in Telangana

Basti Dawakhana: హైదరాబాద్ నగరంలో కరోనా బారిన పడ్డ రోగులకు మరింత వేగంగా వైద్య సేవలందించేందుకు తెలంగాణా ప్రభుత్వం సంకల్పించింది. ఒక గల్లీలో రోగమొస్తే మరొక గల్లీకి పోకుండా ఎక్కడి కక్కడే వైద్య సేవలందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా నగరంలో మరో 26 కొత్త దవాఖానాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

నగరంలో మరో 26 బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాయి. ఇందులో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 18, మేడ్చల్‌లో ఆరు, రంగారెడ్డిలో రెండు ఉన్నాయి. వీటిని ఈ నెల 14న ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో గ్రేటర్‌ పరిధిలో బస్తీ దవాఖానల సంఖ్య 196కు చేరనుంది. ఈ మేరకు రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో బస్తీ దవాఖానలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త బస్తీ దవాఖానల ఏర్పాటు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు నగరంలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌ జిల్లాలో 95, రంగారెడ్డిలో 32, మేడ్చల్‌లో 40, సంగారెడ్డిలో మూడుతో కలిపి మొత్తం 170 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా రోజుకు 14 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. కొత్తగా ప్రారంభించే 26 దవాఖానలతో మరో రెండు వేల మందికి వైద్య సేవలు లభిస్తాయన్నారు. ఈ వైద్యశాలల్లో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సు, అటెండర్‌ విధులు నిర్వహిస్తారన్నారు. ఈ వైద్యశాలల్లో ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు లభిస్తాయన్నారు.

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుకు రెండు చొప్పున మొత్తం 300 బస్తీ వైద్యశాలలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వీటి సంఖ్యను పెంచుతామన్నారు. ప్రస్తుత బస్తీ దవాఖానల్లో ఉన్న చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యా, వైద్యం, గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. నూతన బస్తీ వైద్యశాలలను తనతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, శాసనమండలి ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు ప్రారంభిస్తారని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, కలెక్టర్‌ శ్వేతా మహంతి, గ్రేటర్‌లోని నాలుగు జిల్లాల వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు.

కొత్త బస్తీ దవాఖానల వివరాలు..

సంతోష్‌నగర్‌- జవహర్‌నగర్‌, గన్‌ఫౌండ్రీ-గడిఖానా, అడిక్‌మెట్‌-పోచమ్మబస్తీ, కుర్మగూడ-మాదన్నపేట్‌, కుర్మగూడ-వికాస్‌నగర్‌, దూద్‌బౌలి-దూద్‌బౌలి, కిషన్‌బాగ్‌-అల్లామజీద్‌, హబీబ్‌గూడ-రాంరెడ్డినగర్‌, భోలక్‌పూర్‌, రాంగోపాల్‌పేట్‌, రాంనాస్‌పుర-మోచీ కాలనీ, దూద్‌బౌలి-బండ్లగూడ, కవాడిగూడ-భీమామైదాన్‌, లంగర్‌హౌస్‌-ఇబ్రహీం బస్తీ, జియాగూడ- ఎంసీహెచ్‌ కాలనీ, ఖైరతాబాద్‌-కుమ్మరబస్తీ, సనత్‌నగర్‌-అశోక్‌నగర్‌, బన్సీలాల్‌పేట్‌-బాపూజీనగర్‌, మన్సూరాబాద్‌-వీరన్నగుట్ట, హస్తినాపురం-బూపేష్‌గుప్తా నగర్‌, వెంగళరావునగర్‌- జవహర్‌నగర్‌, ఎఎస్‌రావు నగర్‌-హుడాపార్క్‌, ఉప్పల్‌-శారదానగర్‌, గాజులరామారం-గాజుల రామారం విలేజ్‌, సూరారం-శ్రీ కృష్ణానగర్‌,మౌలాలి-ఎంజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌.

Tags:    

Similar News