మొబైల్ వాహనంలో టెస్టింగ్ ల్యాబ్.. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం
Mobile Testing Labs: ఇప్పటివరకు కరోనా టెస్టులపై అరోపణలు ఎదుర్కొన్న తెలంగాణా ప్రభుత్వం వాటిని గ్రామ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Mobile Testing Labs: ఇప్పటివరకు కరోనా టెస్టులపై అరోపణలు ఎదుర్కొన్న తెలంగాణా ప్రభుత్వం వాటిని గ్రామ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న టెస్టులతో పాటు ప్రత్యేకంగా నియోజక వర్గానికి ఒకటి చొప్పున మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ లోనే 20 మొబైల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికాగా, ప్రభుత్వం ఆమోదంతో రోడ్డెక్కనున్నాయి.
ప్రతీ నియోజకవర్గానికి ఒక కరోనా టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీని అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా ప్రతీ గ్రామానికి వెళ్లి జ్వరం సహా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి కరోనా నిర్ధారణ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ముఖ్యమంత్రి నుంచి అనుమతి వచ్చాక ప్రజల ముంగిటకే వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించేందుకు 20 మొబైల్ కరోనా టెస్టింగ్ బస్సులను సిద్ధం చేస్తోంది. అందులో ప్రస్తుతం 3–4 బస్సులు ఇప్పటికే బస్తీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన వాటిని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తారు. అలాగే ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి ఒక మొబైల్ టెస్టింగ్ లేబొరేటరీ చొప్పున వంద బస్సులను సమకూర్చాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీలో 'వెర' స్మార్ట్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీస్ క్వారంటైన్ (ఐ–మాస్క్) టెక్నాలజీతో చేసిన వోల్వో బస్సుల్లో కరోనా లేబొరేటరీ కల్పించినట్లే, ప్రతీ నియోజకవర్గంలో సమకూర్చుతారు.
పరీక్షల సంఖ్య రెండింతలు
ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు రోజూ దాదాపు 22 వేల వరకు చేస్తున్నారు. ఇకపై రోజూ 40 వేల కరోనా పరీక్షలు చేయాలని కేబినెట్ నిర్ణయించడంతో ప్రతి బస్సులో ఒకేసారి పది మందికి కరోనా పరీక్షలు చేసే వీలుంది. అలా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో నడుపుతున్న 3 మొబైల్ బస్సుల్లో రోజూ ఒక్కో దాంట్లో 300 పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే వంద బస్సులు వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో 30 వేల టెస్టులు వీటి ద్వారానే నిర్వహించవచ్చునని వైద్య వర్గాలు చెబుతున్నాయి.