రాష్ట్రంలో ఎప్పుడో జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. అయితే రాష్ట్రంలో కోవిడ్ కేసులు కాస్త తగ్గడంతో ఎంసెట్ నిర్వహకులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 9, 10, 11, 14 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ నాలుగు రోజుల పాటు తెలంగాణలో 79, కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరయ్యారని అంచనా. అయితే ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చాలా మంది విద్యార్ధులు కరోనా బారిన పడి ఉండడంతో వారు పరీక్షలకు హాజరు కాలేకపోయారు. అలాంటి విద్యార్ధులకు ఎంసెట్ నిర్వాహకులు శుభవార్త తెలిపారు.
ఎంసెట్ రాయని విద్యార్ధులకు ఈ నెల 8న ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే ఈనెల 5 అర్ధరాత్రిలోగా విద్యార్ధులు కరోనా పాజిటివ్, నెగెటివ్ సర్టిఫికెట్లతోపాటు హాల్‌టికెట్ కూడా కన్వీనర్ ఈ– మెయిల్‌కుపంపాలని సూచించారు. వారికి పరీక్ష కేంద్రం, సీబీటీ కోసం స్లాట్ బుక్‌చేసి, ఆ సమాచారాన్ని తెలియజేస్తామని వివరించారు. ఇందుకు convenertseamcet2020 a@jntuh.ac.inను సంప్రదించాలని తెలిపారు. http://eamcet.tsche.ac.inను సైతం చూడాలని సూచించారు.