E-Cet Final Counselling : ఈ సెట్ తుది విడుత కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు ఈ రోజునుంచి ప్రారంభించనున్నారు. అధికారులు ధ్రువీకరణ పత్రాలను మంగళ, బుధవారాల్లో పరిశీలించి, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం ఈ సెట్ తుది విడుత సీట్లను ఈ నెల 9న కేటాయించనున్నారు. అదే విధంగా ఈ సెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను సీట్లు కేటాయించిన రోజునే కళాశాలల్లో నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే మొదటిదశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలిదశలోనే డిగ్రీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు నిర్వహించే ఈసెట్ ద్వారా 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 24,832 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, వారిలో 17,647 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కాగా ఆన్‌లైన్‌లో ఆప్షన్లను 17,529 మంది అభ్యర్థులు నమోదు చేశారు. ఇందులో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 170 కాలేజీల్లో 9,388 సీట్లు ఉండగా, 8,953 సీట్లకు అభ్యర్థులు ఎంపిక కావడంతో మొదటి విడుతలోనే ఏకంగా 95.36 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈసెట్ ద్వారా మొత్తం 10,418 సీట్ల భర్తీకి అవకాశం ఉండగా.. మొదటి విడుతలోనే ఏకంగా 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీ స్ట్రీమ్‌లో 125 కాలేజీల్లో 1,030 సీట్లు ఉండగా, కేవలం ఏడుగురు అభ్యర్థులకు మాత్రమే సీట్లు దక్కాయి. ఈ నెల 12 నుంచి అభ్యర్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఇక విద్యార్ధులు ఎదురుచూస్తున్న టీఎస్ ఎంసెట్ -2020 ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్ధులు ఎంసెట్ ఫలితాల కోసం https://www.ntnews.com/ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చని తెలిపారు.