ఆ పార్టీ జీవితకాలం లేటు. ఆలస్యానికి బ్రాండ్ అంబాసిడర్. ఎదురుదెబ్బలు తగిలినా, గుణపాఠాలు మాత్రం నేర్వడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గ్రౌండ్‌లోకి దిగితే, సదరు పార్టీ మాత్రం నత్తకు అత్తలా బిహేవ్ చేస్తోంది. కాలయాపనలో కాలకేయ పార్టీగా మారింది.
ఒక రాజకీయ పార్టీ ఎలా వుండకూడదో చెప్పమంటే, ఎవ్వరైనా పది ఉదాహరణలు ఎందుకు, తెలంగాణ కాంగ్రెస్‌ను చూపిస్తే సరిపోతుందని అంటున్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా, కార్యకర్తలు కూడా సోసోగా లాగించేస్తున్నారు. అరే, ఒకవైపు తమను రీప్లేస్ చేసేందుకు బీజేపీ అరవీర భయంకరంగా దూసుకొస్తుంటే, ఏమాత్రం ఉలుకూలేదు పలుకులేదు శతాధిక పార్టీలో. వరుస అపజయాలు ఎదురైనా, ఏమాత్రం మార్పు రావడం లేదు. దుబ్బాక ఎన్నికల్లో మొదట్లో రెచ్చిపోయిన కాంగ్రెస్, ఎప్పుడైతే కాషాయ పార్టీ గేరు మార్చి, దూసుకెళ్లడం ప్రారంభించిందో, అప్పుడే చతికిలపడింది. ఆలస్యంగా నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో వాటిని ప్రబలంగా తీసుకెళ్లడంలో అలసత్వం, కాంగ్రెస్ పుట్టి ముంచుతున్నవాటిలో మచ్చుకు రెండు. ఇందుకు తాజాగా మరో ఉదాహరణ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఇప్పటి వరకు అభ్యర్థినే ప్రకటించకపోవడం.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓ వైపు రెండు అధికార పార్టీలు, టిఆర్ఎస్, బిజేపిలు ఓటు నమోదు కార్యక్రమం కోసం కమీటీలు వేసి, పార్టీ ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించాయి. టిఆర్ఎస్ అయితే, మరింత సీరియస్‌గా తీసుకుంది. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారంటే, ఎంత ప్రెష్టీజియస్‌గా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గెలుపు బాధ్యత ఇచ్చారు కేసీఆర్. లైట్ తీసుకున్న ఎమ్మెల్యేల విషయంలో సీరియస్‌గా వుంటామని హెచ్చరించారు కూడా.
ఇక బీజేపీ కూడా పట్టభద్రుల పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా గెలిచి, తెలంగాణలో కాషాయ ప్రభంజనాన్ని మొదలుపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్‌ల నుంచి మళ్లీ రామచందర్‌నే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి దాదాపు అభ్యర్థిని డిసైడ్ చేసింది. ఇప్పటికే ఆయా నేతలు సైతం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.
అయితే, రేసులో వున్నది తామే, గెలిచేది తామేనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ మాత్రం, ఇప్పటి వరకు అభ్యర్థిని మాత్రం డిసైడ్ చెయ్యలేదు. కనీసం వడబోత కార్యక్రమం కూడా మొదలుపెట్టలేదని అర్థమవుతోంది. ఎవరికైనా మద్దతిస్తారా అన్న విషయం కూడా తేల్చడం లేదు. ఇప్పటికే జనసమితి నుంచి ఆ పార్టీ అధినేత కోదండరాం పోటి చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తనకు మద్దతు ఇస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ మాత్రం మాట్లాడకుండా సైలెంట్ మెయిన్‌టైన్ చేస్తోంది.
అయితే కాంగ్రెస్‌లో మాత్రం ఆశావహులు భారీగానే వున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత గూడురు నారాయణ రెడ్డి, టికెట్ క్యూలో మొదట్లో వున్నారట. గత పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీకి రెడీ అయినా, కోమటి రెడ్డి బ్రదర్స్ టిక్కెట్టు రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ, వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారట నారాయణ రెడ్డి. ఈయనకు పిసిసి అధ్యక్షడు ఉత్తంతో పాటు, కొత్త ఇంచార్జ్ ఆశీస్సులు కూడా ఉన్నాయని పార్టీలో చర్చ సాగుతోంది. ఈయనతో పాటు, పార్టీలో కొందరు పోటికి సిద్దంగా ఉన్నా, పార్టీ నిర్ణయం తీసుకోకుండా నాన్చుడు ధోరణి అనుసరిస్తోందని, సీనియర్లు రగిలిపోతున్నారు.
ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, పట్టభద్రుల స్థానం విషయంలోనూ ఎటూ తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. పార్టీలో చాలామంది అక్కడ నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న నేతలు ఉన్నా రాష్ట్ర నాయకత్వంలో మాత్రం చప్పుడు లేదు. కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్సీ టిక్కెట్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఆయనకు మద్దతుగా చక్రం తిప్పుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఈ స్థానాన్నా బీసికి ఇవ్వాలని పార్టీలో ఒత్తిడి తెస్తున్నారట. కూనకు టిక్కెట్టు కేటాయిస్తే, ఎలా గెలిపించాలో తన వద్ద స్కెచ్ ఉందని అంటున్నారట రేవంత్.
మొత్తానికి ఎదురుదెబ్బలు ఎన్ని తిన్నా, గుణపాఠాలు నేర్వడం లేదు కాంగ్రెస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా లైట్ తీసుకుంటోంది. అటు అధికార పార్టీ పట్టుదలగా వుంది, ఇటు బీజేపీ సైతం సై సై అంటోంది. అయినా, ఖద్దరు నేతలు మాత్రం నిద్రం నుంచి మేల్కోవడం లేదు. ఇలాగైతే పార్టీ మరింత నష్టపోతుందని సీనియర్లు బాధపడిపోతున్నారు.