తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు విభిన్న పోటీ నెలకొంది. ఓ దగ్గర టికెట్ కోసం నాయకులు ఎగబడుతుంటే మరో దగ్గర ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. మీ ఇష్టమంటూ పార్టీ పెద్దలకే చాయిస్ ఇచ్చేస్తున్నారు. ఇంతకీ ఏ స్థానానికి పోటీ ఉంది. ఏ స్థానాన్ని లైట్ తీసుకుంటున్నారో ఇప్పుడు చుద్దాం.
త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. అయితే పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పెద్దలు దరఖాస్తులు స్వీకరించారు. ఈ రెండు స్థానలకు దాదాపు 30 పైగా అప్లికేషన్లు వచ్చాయి.
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ స్థానాల్లో టికెట్ కోసం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం టిక్కెట్టు కావాలంటూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. వారిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి , ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్, అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, హర్షవర్దన్ రెడ్డితో పాటు అడ్వకేట్లు, పార్టీలో పనిచేసే పట్టభద్రులు దరఖాస్తులు పెట్టుకున్నారు.
అయితే ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 8మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ స్థానానికి పోటీ చేస్తున్న జనసమితి అధ్యక్షుడు, మాజీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుకు రావడం లేదనే చర్చజరుగుతోంది. దరఖాస్తులను స్వీకరించిన కాంగ్రెస్ పెద్దలు ఎవరిని ఫైనల్ అభ్యర్థిగా ప్రకటిస్తారో అని పార్టీ నేతలు అతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న వాళ్లకే కాకుండా ఇతర నేతలకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.