హుజూరాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్, నిరుద్యోగ, రైతుల సమస్యలే ప్రధానం...
Huzurabad By Elections 2021: గాంధీభవన్‌లో పీసీసీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్, మండలం, ఊరికో ఇన్‌చార్జ్‌ని నియమించాలని నిర్ణయం
Huzurabad By Elections 2021: హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారంపై దృష్టి సారించింది. ఆలస్యంగా అభ్యర్ధిని ప్రకటించినా.. కాంగ్రెస్ తన సాంప్రదాయ ఓటు బ్యాంకును చేజారకుండా చూడడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో బాగంగా గాంధిభవన్‌లో హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్టాటజీ మీటింగ్‌ను నిర్వహించింది. పార్టీ AICC సహ ఇంచార్జ్ శ్రీనివాస్ అధ్వర్యంలో జరిగిన సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ కమిటి చైర్మెన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని మండలాలకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఇంఛార్జులగా నియమించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో నిరుద్యోగ, రైతుల సమస్య, కేంద్రం పెంచిన పెట్రోల్, డిజీల్ పైనే ప్రధాన దృష్టిపెట్టింది కాంగ్రెస్. ఈ రెండు అధికార పార్టీలపై వ్యతిరేకత హుజూరాబాద్‌లో తమకు ఓట్లు వచ్చేలా చేస్తాయని హస్తం పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. వీటినే ప్రచార అస్త్రంగా మలుచుకుంది. మాజీ మంత్రి ఈటెల రాజెందర్ అవినీతి, టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో ఈ ఎన్నికలు వచ్చాయని ఆ రెండు పార్టీలకు ఓటు వేయకుండా కాంగ్రెస్‌ను ఆదరించాలని హుజూరాబాద్ ప్రజలను హస్తం పార్టీ కోరాలని డిసైడ్ అయింది.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత వస్తున్న తొలి ఎన్నికలు కాబట్టి ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్‌పైనే కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే రేవంత్ మాత్రం ఎప్పుడు ప్రచారానికి వస్తారో అని మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతలు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా విద్యార్థి నాయకుడు బల్మూర్ వెంకట్‌ను గెలిపించాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయాత్నాలు చేస్తోంది.