Indiramma illu mobile app: ఇందిరమ్మ ఇల్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఈ యాప్ ఉంటే చాలు
Indiramma illu mobile app to help indiramma housing scheme applicants: పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆ యాప్ ఆధారంగా రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలన్నదే తమ ధ్యేయమని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ది పొందడం ఎలా? ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఎంత డబ్బు అందజేస్తుంది. ఎన్ని గృహాలు మంజూరు చేస్తుందనే విషయాలను తెలుసుకుందాం.
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వం ఓ యాప్‌ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ యాప్‌ను డిసెంబర్ 5న ఆవిష్కరించారు. లబ్దిదారులు ఇంటి దగ్గర ఉంటే చాలు.. అధికారులే దరఖాస్తుదారుని ఇంటికి వచ్చేస్తారు. అర్హత ఉంటే చాలు ఈ పథకంతో లబ్ది పొందవచ్చు. ఇందిరమ్మ మొబైల్ యాప్ ద్వారా మీ వివరాలను అధికారులు వెరిఫై చేస్తారు. అసలు మీకు ఇళ్లు ఉందా? ఇంటిలో ఎంతమంది సభ్యులు ఉంటున్నారో ముందుగా తెలుసుకుంటారు. ఆ తర్వాత అర్హత ఉంటే ఇంటిని మంజూరు చేస్తారు.
అర్హత పొందిన వారికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం చేస్తుంది. లబ్దిదారులకు ఇంటి ప్లాన్ అర్థం కాకున్నా.. ఎలా నిర్మించుకోవాలో తెలియకున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే ప్రభుత్వం అందుకు తగ్గ నమూనాలను కూడా తయారు చేసింది. ఆర్థిక స్తోమత బాగుండి ఇంకా డబ్బులు వెచ్చించి ఇంటిని నిర్మించుకోవాలని భావించినా.. మీ ఇష్టా రీతిలో ఇంటిని మీరు నిర్మించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్దిదారుల పేర్లు నమోదు చేయనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు.