గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. వర్షాలు, వరదల అనంతరం తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. నగరంలో భారీ వరదలు, వర్షాలు కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉండడంతో ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ సమావేశానికి పంచాయత్‌రాజ్, విద్యుత్‌శాఖల మంత్రులు కేటీఆర్, మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ బి, విద్యుత్ శాఖ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రీనివాస్ యాదవ్, ఎస్ పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, మున్సిపల్ వ్యవసాయ, ఆర్ అండ్ బి శాఖల ముఖ్య కార్యదర్శులు, మెహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, జిహెచ్ ఎంసి కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితి, ప్రస్తుతం తీసుకున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు, అంచనాలతో సమావేశానికి రావాలని సీఎం చెప్పారు.