ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
Narendra Modi - KCR: ఈ నెల 26న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ...
Narendra Modi - KCR: రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. ఏడ మొహం పెడ మొహం అన్నట్లుగా రెండు ప్రభుత్వాలు ఉండటంతో వైరం మరింత ముదురుతోంది. ఈనెల 26న ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. రెండోసారి పర్యటనలోనైన కేసీఆర్ మోడీకి ఆహ్వానం పలుకుతారా లేదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ప్రధాని హోదాలో మోడీ గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ డుమ్మా కొట్టడంతో రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముచ్చింతల్ లో సమత మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి కేసీఆర్ కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే తాజాగా మరోసారి ఈనెల 26న మోడీ గచ్చిబౌలి లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్నారు.
అదే రోజు సీఎం కేసీఆర్ బెంగుళూరులో పర్యటించనున్నారు. మాజీ ప్రధాని దేవగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తో భేటీ కానున్నారు. ఆ రోజు రాత్రి కూడా కేసీఆర్ అక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో రెండోసారి కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లే అవకాశం లేదని అధికారుల్లో చర్చ జరుగుతుంది. ఈ టూర్ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి మరింత గ్యాప్ పెరిగే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం రాష్ట్రానికి అప్పులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుతగులుతుందని దానిలో భాగంగానే సీఎం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు మోడీ టూర్ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గవర్నర్ తమిళిసై మోడీకి స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకి వెళ‌్లనున్నారు.
మొత్తానికి మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. మోడీ టూర్ తర్వాత BJP, TRS మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచే ఛాన్స్ఉంది. ఈ నెల 26న కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉంటారా లేదా బెంగళూరు వెళ్తారా అన్నది వేచి చూడాలి.