ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం కేసీఆర్
* ఉ.11 గం.లకు కాళేశ్వరానికి చేరుకోనున్న కేసీఆర్ * 11.45 గం.లకు కాళేశ్వర ముక్తేశ్వరస్వామి క్షేత్రంలో పూజలు * 11.55 గం.లకు మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ సందర్శన * ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
ఈరోజు సీఎం కేసీఆర్ కాళేశ్వరంలో పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరనున్నారు. ఉదయం11 గంటలకు కాళేశ్వరానికి చేరుకోనున్నారు. ముందుగా 11.45 నిమిషాలకు కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి చేరుకొని.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజీకి సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్తారు. అధికారులతో కలిసి ఆయన బ్యారేజీ, ఆనకట్ట, పరిసర ప్రాంతాలను పరిశీలించనున్నారు.
మేడిగడ్డ దగ్గర నీటిమట్టం వంద అడుగులకు చేరింది. దీంతో ఐదు నెలల తర్వాత కాళేశ్వరంలో మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. నిల్వ ఉంచిన 16 టీఎంసీల నీటిని మేడిగడ్డ పంప్‌హౌస్ ద్వారా ఎత్తిపోస్తున్న తీరును.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే ఇరిగేషన్ ఇంజనీర్లతో సమీక్షించి.. దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు సీఎం కేసీఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజీ. కాళేశ్వరం దగ్గర గోదావరిలో ప్రాణహిత నది కలిసే చోటుకు ఎగువన మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. దీనికి మొత్తం 85 గేట్లను ఏర్పాటు చేసి.. కుడి, ఎడమ వైపు కరకట్టలు కట్టారు.