రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితో కొట్లాటకైనా సిద్ధమే!
KCR Meeting In Pragati Bhavan : తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR Meeting In Pragati Bhavan : తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదని, పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని అన్నారు.. ఇక తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని అన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు.
తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై ఈనెల (అక్టోబర్) 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు.
అటు నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో నిన్నటి అధికారుల సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నదని అన్నారు.. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలని అధికారులకి సూచించారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలని, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలని సూచించారు.