తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో విద్యార్థులకు ఈసారి మరింత ఛాయిస్ ఇచ్చేలా ప్రశ్నల సంఖ్యను పెంచడంపై ఇంటర్మీడియట్ బోర్డు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్‌లో అతిస్వల్ప జవాబు ప్రశ్నల్లో అసలు ఛాయిస్ ఉండదు. మిగిలిన షార్ట్, లాంగ్ జవాబు ప్రశ్నల్లో కొంతమేర ఛాయిస్ ఉంది. రెండు మార్కులు అతిస్వల్ప జవాబు ప్రశ్నలు పది ఇస్తారు. అన్నీంటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇక నాలుగు మార్కుల స్వల్ప జవాబు ప్రశ్నలు ఎనిమిది ఇస్తే ఐదు, 8 మార్కుల దీర్ఘ జవాబు ప్రశ్నలు మూడు ఇస్తే రెండు రాయాల్సి ఉంటుంది.
అయితే ఈసారి ఈ రెండింటిలో కూడా మరింత ఛాయిస్ పెంచనున్నారు. అంటే దాదాపు 50శాతం ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాసేలా ఉండొచ్చని తెలుస్తోంది. అన్ని సబ్జెక్టుల క్వశ్చన్ పేపర్ కూడా ఇదే తరహాలో ఉండనున్నట్లు సమాచారం. దాని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక సైన్స్ గ్రూపు విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఏప్రిల్ నెలాఖరులో పరీక్షలు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి కాబట్టి.. మార్చి నెలాఖరు వరకు సిలబస్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. పరీక్షల నిర్వహణ తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి దాదాపు 9.50 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు.