Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది. సోమవారం ఉదయం వాడీ వేడిగా మొదలైన శాసనసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఈ రోజు నిర్వహించిన సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఆ తరువాత రేపు ఉదయం 10గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ముందుగా ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల సమస్యలు, కారుణ్య నియామకాలపై సభ్యులు ప్రశ్నలను లేవనెత్తారు. కాగా వాటికి సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అనంతరం కేసీఆర్ కిట్ల గురించి అడిగిన ప్రశ్నలకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానాలు ఇచ్చారు. అనంతరం జీరో అవర్ కొనసాగింది. ఆ తరువాత సభలో పలు బిల్లులపై చర్చ జరిగింది. అనంతరం ఈ చర్చలో పలువురు మంత్రులు వివరణ ఇవ్వడంతో 8 బిల్లులకు సభ మోదం తెలిపింది.
ఇక సభ ఆమోదించిన బిల్లుల వివరాల విషయానికొస్తే ముందుగా 1. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుకు ఆమోదం తెలిపింది. 2. తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. 3. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధృవీకరణ విధానం (టీ ఎస్- బి పాస్) బిల్లును కూడా ఈ రోజు సభ ఆమోదం తెలిపింది. 4.తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లుపై ఆమోదం తెలిపింది. 5. తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు కు కూడా ఈ రోజు ఆమోదం తెలిపింది. 6. తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. 7. తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. చివరగా 8. తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది.