Telangana Budget 2021: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2021-2022 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా 18వ తేదీన ఉదయం ఉభయసభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
ఈనెల 15 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 15 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేసీఆర్‌కు అందజేశారు అధికారులు. సీఎం కేసీఆర్ ఆమోదంతో ఫైనల్ బడ్జెట్ సిద్ధం కానుంది. మార్చి 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 16వ తేదీన దివంగత ప్రజాప్రతినిధుల మృతికి సంతాప తీర్మానం 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. 18న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుత రాబడి, వ్యయాలకు అనుగుణంగా పద్దులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నా సాగునీటి రంగంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చులో సగానికి పైగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఖర్చు చేసింది ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్, బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలతో కలిపి 15వేల 150 కోట్లు ఖర్చు చేసింది. గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణ, పునరావాసాలు, విద్యుత్తు బిల్లులు కలిపి సుమారు రూ.10,500 కోట్లు చెల్లించాల్సి ఉంది.
కొవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి కోలుకొని వివిధ రంగాలను పునరుద్ధరించుకునే క్రమంలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేలచూపులు చూస్తున్న రంగాలకు ఊపిరిలూది వాటిని తిరిగి మేలుబాట పట్టించడం ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. గతేడాది లక్షా 82 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ సారి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది.
నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపధ్యంలో అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న గొల్ల కురుమలను ఆకర్షించేందుకు బడ్జెట్ లో తాయిలాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. ఇప్పటికే పంపిణీ చేసిన 3 లక్షల 70 వేల గొర్రెల యూనిట్లకు అదనంగా మరో 3 లక్షల యూనిట్లు పంపిణీ చేసేందుకు బడ్జెట్‌లో ప్రతిపాధనలను పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.