Telangana Assembly: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కీలక తీర్మానం చేయనున్న సర్కార్
Telangana Assembly: తెలంగాణ శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభ వేదికగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నారు.
Telangana Assembly: తెలంగాణ శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభ వేదికగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు.
శాసనసభ నాలుగో విడతలో రెండో సమావేశంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కోరారు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణ నియమాల విధానంలోని 16 నియమం కింద గల రెండో నిబంధన ప్రకారం తనకున్న అధికారాల మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలను పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంతాపదినాల్లోనే శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమవారం జరిగే సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆచార్యునిగా, ఆర్థికవేత్తగా, యూజీసీ ఛైర్మన్ గా, ఆర్ బీఐ గవర్నర్ గా, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షునిగా, దేశ ఆర్థికమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవల గురించి ప్రస్తావించనున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ అందించిన సహకారంపైనా చర్చించి ఆయన మృతికి సంతాపం తెలియజేయనున్నారు.
శాసనసభ ప్రత్యేక సమావేశం దృష్ట్యా ఈ నెల 30న జరగాల్సిన మంత్రిమండలి సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గతంలోనే ఈ సమావేశం ఖరారైనా సంతాపదినాలు అయినందున దానిని నిర్వహించరాదని నిర్ణయించింది. జనవరి మొదటి వారంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి.