తొలగని ప్రతిష్టంభన.. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రస్తుతం లేనట్టే!

ఆర్టీసీ అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఇప్పట్లో లేనట్టే!

Update: 2020-10-07 17:34 GMT

తెలంగాణా- ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుకునే విషయం పై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీలు ఈరోజు సమావేశం అయ్యారు. అయితే, సమావేశంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేకపోయారు. 

రెండు లక్షల కిలోమీటర్ల మేర తాము తెలంగాణలో సర్వీసులు నడుపుతామని ఎపీఎస్ ఆర్టీసీ అధికారులు కోరారు. దానికి తెలంగాణా అధికారులు అంగీకరించలేదు. ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల సర్వీసులూ లక్షా అరవై ఒక్క వేల కిలోమీటర్లు సర్వీసులు నడుపుకోవాలని టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తెలంగాణా ప్రతిపాదనపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకోలేదని టీఎస్ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. మరో దఫా సమావేశం కావాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. 

దసరా సందర్భంగా పండుగ కోసం ప్రత్యేకంగా బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదనను టీస్ఆర్టీసీ తిరస్కరించింది. పూర్తి స్థాయిలో చర్చలు ముగిసిన తరువాతే.. బస్సులు తిప్పాలని సూచించింది. మరో రెండురోజుల్లో మరోసారి ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ఆపరేషన్స్  ఈడి బ్రహ్మానంద రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. 

కరోనా కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఏడు నెలల క్రితం రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కరోనా పరిస్థితులు చక్కబడి రవాణా వ్యవస్థలు ప్రారంభం అయిన తరువాత ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడపాలని ఇప్పటికే మూడుదఫాలు అధికారుల మధ్య సమావేశాలు జరిగాయి. కానీ, ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. 

Tags:    

Similar News