ఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
T Congress: హాజరుకానున్న జానారెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క
T Congress: మునుగోడును మరోసారి చేజిక్కించుకోవాలి. ఉద్యమాల పురిటి గడ్డపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. సిట్టింగ్ స్థానాన్ని ఇంకోసారి కైవసం చేసుకోవాలి. ప్రస్తుతం హస్తం పార్టీలో జరుగుతున్న మేథోమధనం అంతా దీనికోసమే. నిన్న రోజంతా చర్చలు జరిపిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఇవాళ గాంధీభవన్ వేదికగా మరోసారి మాట్లాడుకోనున్నారు. అవకాశం ఉంటే మునుగోడు విజయం కోసం రోడ్ మ్యాప్‌ను కూడా ఖరారు చేయడమే కాకుండా ఉపఎన్నిక బాధ్యత ఎవరికి అప్పగించాలి..? ఆశావహులు ఎవరెవరు..? మునుగోడును దక్కించుకునే సత్తా ఉన్న క్యాండిడేట్ ఎవరనేదానిపై కూడా చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అధికార పార్టీ ఎత్తుగడలను తిప్పికొట్టడం బీజేపీని అడ్డుకునే వ్యూహాలను రచించనున్నారు.
నిన్న రోజంతా కాంగ్రెస్‌లో మునుగోడు హడావుడే కనిపించింది. ఆశావహులతో ఏఐసిసి కార్యదర్శి బోసురాజు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, కైలాస్ నేత, పల్లె రవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిక్కెట్ ఎవరికిచ్చినా.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని బోసు రాజు సూచించారు. మరోవైపు సీనియర్ నాయకుడు జానారెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర బాద్యులు మాణిక్కం ఠాగూర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ జరగనున్న మీటింగ్‌లో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడుపై వ్యూహాల అమలు కోసం మధుయాష్కి నేతృత్వంలో ఏఐసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెడీ చేసిన రిపోర్ట్‌ను ఇప్పటికే రాష్ట్రనాయకత్వానికి అందజేసింది. దీనిపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు పాల్వాయి సవ్రంతి ఆడియో టేపులపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే తాను మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదంటూ.. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటానని స్రవంతి స్పష్టం చేశారు.
ఇక ఈ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన జరగనున్న మీటింగ్‌కు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. మునుగోడులో అనుసరించాల్సిన వ్యూహాలు, వ్యూహరచన కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చ జరగనుంది. నియోజకవర్గంలోని మండలాలతో పాటు.. గ్రామాలకు ఇంచార్జీలను నియమించనున్నారు. ఈ నెల 16 నుంచి 20 మధ్య మునుగోడు నియోజకవర్గంలోని మండలాల వారిగా రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిపై కూడా చర్చ జరగనుంది. పార్లమెంట్ సమావేశాల తర్వాత రేవంత్.. పూర్తిగా మునుగోడుపైనే ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అభ్యర్థి ఎంపిక సర్వే ద్వారా జరుగుతుందని.. రెండు మూడు రోజుల్లో ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంటుందని.. గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మాణిక్కం ఠాగూర్ కూడా రెండు రోజుల పాటు.. హైదరాబాద్‌లోనే ఉండటంతో.. ఆ లోపు చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.