టీపీసీసీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్‌

* ఇప్పటికీ కొనసాగుతోన్న అభిప్రాయ సేకరణ * టీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోన్న పీసీసీ ఎంపిక * రేవంత్‌కు ఇవ్వొద్దంటోన్న సీనియర్లు

Update: 2020-12-29 03:44 GMT

ఇవాళ రేపు అంటూ రోజులు గడుస్తున్నాయి.. కానీ కొత్త కెప్టెన్‌పై ప్రకటన రాలేదు. అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది..? ఎంపికలో జాప్యానికి కారణాలేంటి..? టీ కాంగ్రెస్‌‌లో విభేదాలతోనే ఆలస్యం అవుతోందా..? జగ్గారెడ్డి ఎందుకు యూ టర్న్ తీసుకున్నట్లు..? ఇంతకీ అధిష్టానం మనసులో ఏముంది..?

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవిపై ఎవరి అంచనాలు వాళ్లవి. ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరినా.. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది అధిష్టానం. ఇప్పటికీ సీనియర్లతో అభిప్రాయాలు సేకరిస్తూనే ఉంది. రేపో మాపో ఈ విష‍యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

 ఉత్తమ్ రాజీనామాతో అభిప్రాయ సేకరణలు జరిపిన కాంగ్రెస్‌ ఇప్పటికీ టీపీసీసీ చీఫ్‌ను ప్రకటించలేదు. అభిప్రాయ సేకరణ తర్వాత అధిష్టానానికి అందిన నివేదికలో కోమటిరెడ్డి, రేవంత్ పేర్లు ఉన్నట్లు లీకులు వచ్చాయి. అయితే అధిష్టానం మాత్రం ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదు. దాంతో సమాలోచనలు జరిపి.. అందరికీ ఆమోదయోగ్యమైన వాళ్లనే ఎంపిక చేయాలనే ఉధ్దేశంలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.

 ఇక పార్టీలో సీనియర్లు తలో మాట మాట్లాడటం కూడా టీపీసీసీ చీఫ్ ఎంపిక ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ప్రధానంగా ఎంపీ రేవంత్ రెడ్డి పేరు తెరపైకి రావటంతో సీనియర్ల నుంచి బిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తమకు ఇవ్వకున్నా సరే కానీ... రేవంత్‌కు ఇవ్వొద్దని వీహెచ్‌ బాహాటంగా ప్రకటించారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ ఠాగూర్‌పై ఆరోపణలు కూడా చేశారు. మరోవైపు ఇప్పట్లో కొత్త వారొద్దని జగ్గారెడ్డి తెలిపారు. ఇక రెండు రోజుల్లోనే జగ్గారెడ్డి తన అభిప్రాయం మార్చుకున్నారు. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమన్నారు. అయితే విభేదాలను హై కమాండ్ సీరియస్‌గా తీసుకోవటంతోనే జగ్గారెడ్డి యూ టర్న్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

 అయితే సంప్రదింపుల ప్రక్రియ కొలిక్కి వచ్చినా... రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వస్తుందా..? టీపీసీసీ చీఫ్ ఎంపికకు ముగింపు పడుతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags:    

Similar News