Sun Risers Super Victory over Bangalore: బెంగళూరు పై సూపర్ విక్టరీ.. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్ ఆశలు సజీవం!

Super Victory over Bangalore: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును ఉతికి ఆరేసింది.

Update: 2020-11-01 05:28 GMT

IPL Cricket | చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును ఉతికి ఆరేసింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో హైదరాబాద్ ఆటగాళ్ళు ఆల్రౌండ్ ప్రతిభతో మెరిశారు. బ్యాటింగ్ లో దిగ్గజాలు ఉన్న బెంగళూరు ను మొదట తక్కువ స్కోరుకే కట్టడి చేసిన హైదరాబాదీలు తరువాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకొని చక్కని విజయాన్ని నమోదు చేశారు. ఇక ఈ అద్భుత విక్టరీతో నాలుగో ప్లేసులోకి దూసుకు వెళ్ళింది సన్‌రైజర్స్‌ అయితే, మరోవైపు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఫెయిలైన ఆర్‌సీబీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడి డీలా పడింది. సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నప్పటికీ లాస్ట్‌ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ఆ టీమ్​ప్లే ఆఫ్స్‌ చేరుకోగలదు.

కీలక దశలో సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మెరిసింది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన వార్నర్‌‌సేన శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఐదు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి ప్లేఆఫ్స్‌‌ రేసులో నిలిచింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేసింది. ఓపెనర్‌‌ జోష్‌‌ ఫిలిప్‌‌ (32) టాప్‌‌ స్కోరర్‌‌. సన్‌‌రైజర్స్‌‌ బౌలర్లలో సందీప్‌‌ శర్మ (2/20), జేసన్‌‌ హోల్డర్‌‌ (2/27) చెరో రెండు వికెట్లు తీయగా.. నటరాజన్‌‌ (1/11) పొదుపుగా బౌలింగ్‌‌ చేశాడు. అనంతరం 14.1 ఓవర్లలోనే 121/5 స్కోరు చేసిన రైజర్స్‌‌ ఈజీగా గెలిచింది. వృద్ధిమాన్‌‌ సాహా (32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 39) టాప్‌‌ స్కోరర్‌‌. మనీశ్​ పాండే (19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో26), హోల్డర్‌‌ (10 బంతుల్లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 26 నాటౌట్‌‌) మెరిశారు. సందీప్​కు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

అలవోకగా..

తక్కువ స్కోరు టార్గెట్‌‌ ఛేజింగ్‌‌ చేసే క్రమంలో ఆరంభంలోనే డేవిడ్‌‌ వార్నర్‌‌ వికెట్‌‌ కోల్పోయింది సన్‌రైజర్స్‌. తరువాత మనీశ్‌‌ పాండే, సాహా సెకండ్‌‌ వికెట్‌‌కు 50 రన్స్‌‌ జోడించి విజయానికి పునాది వేశారు. ఆర్‌‌సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసినా.. బోర్డు మీద టార్గెట్‌‌ మరీ చిన్నది కావడంతో సన్‌రైజర్స్‌ విజయం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. కెప్టెన్‌‌ కోహ్లీ సెకండ్‌‌ ఓవర్లోనే స్పిన్నర్‌‌ సుందర్‌‌ను బౌలింగ్‌‌కు దింపగా.. ఫస్ట్‌‌ బాల్‌‌కే వార్నర్‌‌ (8) సిక్స్‌‌ కొట్టి ఊపుమీద ఉన్నట్టు కనిపించాడు. అయితే, తర్వాతి బాల్‌‌కే మరో సిక్స్‌‌కు ట్రై చేసిన డేవిడ్‌‌ లైన్‌‌ మిస్సై ఉడానకు చిక్కాడు. వన్‌‌డౌన్‌‌ ప్లేయర్‌‌ పాండే ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. సైనీ బౌలింగ్‌‌లో 4,6 బాదిన అతను మోరిస్‌‌ బౌలింగ్‌‌లో 2 ఫోర్లు రాబట్టాడు. మరో ఓపెనర్‌‌ సాహా.. సిరాజ్‌‌ బౌలింగ్‌‌లో 4, 6 కొట్టడంతో పవర్‌‌ప్లేలోనే 58 రన్స్‌‌ వచ్చాయి. అయితే, చహల్‌‌ బౌలింగ్‌‌లో అనవసర షాట్‌‌ ఆడిన పాండే ఔటయ్యాడు. ఈ టైమ్‌‌లో విలియమ్సన్‌‌ (8) జాగ్రత్త పడడంతో రన్‌‌రేట్‌‌ తగ్గింది. ఉడాన, చహల్‌‌ బౌలింగ్‌‌లో రెండు ఫోర్లు కొట్టిన సాహా మళ్లీ జోరు పెంచాడు. కానీ, మరో షాట్‌‌ ఆడే ప్రయత్నంలో అతను స్టంపౌట్‌‌ కావడంతో రైజర్స్‌‌ మూడో వికెట్‌‌ కోల్పోయింది. కొద్దిసేపటికే విలియమ్సన్‌‌ను ఔట్​ చేసిన ఉడాన ఆర్‌‌సీబీని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, క్రీజులోకి వచ్చిన హోల్డర్‌‌ అదే ఓవర్లో సిక్స్‌‌తో ఒత్తిడి తగ్గించాడు. సైనీ బౌలింగ్‌‌లో అతను 6, 4 బాదగా.. అభిషేక్‌‌ (8) కూడా సిక్స్‌‌ కొట్టాడు. అదే ఓవర్లో అతను ఔటైనా.. చహల్‌‌ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో హోల్డర్‌‌ మ్యాచ్‌‌ ముగించాడు.

అదరగొట్టిన బౌలర్లు..

తొలుత టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న కెప్టెన్ వార్నర్‌ నిర్ణయానికి హైదరాబాద్‌ బౌలర్లు న్యాయం చేశారు. పదునైన బౌలింగ్‌తో రన్స్‌ కట్టడి చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆర్‌సీబీని కట్టడి చేశారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న దేవదత్‌ పడిక్కల్‌ (5) తో పాటు డేంజర్‌ మ్యాన్‌ విరాట్‌ కోహ్లీ (7) ని పవర్‌ ప్లేలోనే వెనక్కుపంపి పైచేయి సాధించిన రైజర్స్​ చివరిదాకా ఇదే జోరు కొనసాగించింది. ఈ రెండు వికెట్లూ సందీప్‌ శర్మకే పడ్డాయి. మూడో ఓవర్లో కాస్త స్వింగ్‌ అవుతూ నేరుగా వచ్చిన బాల్‌ను లాఫ్ట్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన పడిక్కల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆపై మెగా లీగ్‌లో కోహ్లీని సందీప్‌ రికార్డు స్థాయిలో ఏడోసారి ఔట్‌ చేశాడు. అతను వేసిన ఊరించే బాల్‌ను కోహ్లీ నేరుగా షార్ట్‌ కవర్‌లో విలియమ్సన్‌ చేతిలోకి కొట్టాడు. ఆరో ఓవర్లో నటరాజన్‌ ఒకే పరుగివ్వగా.. పవర్‌ప్లేలోనే ఆర్‌సీబీ 30/2తో డీలా పడింది. తర్వాతి ఓవర్లోనే ఏబీ డివిలియర్స్‌ (24) కూడా ఔటవ్వాల్సింది. అతనిచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను స్పిన్నర్‌ నదీమ్‌ డ్రాప్‌ చేశాడు. అప్పటికి 4 రన్స్‌ వద్ద ఉన్న ఏబీ తన స్టయిల్‌కు భిన్నంగా జాగ్రత్తగా ఆడాడు. 18వ బాల్‌కు గానీ బౌండ్రీ కొట్టలేకపోయాడు. మరో ఎండ్‌లో ఓపెనర్‌ జోష్‌ ఫిలిప్‌ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. అయినా నదీమ్‌, రషీద్‌ ఖాన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పది ఓవర్లలో 61 పరుగులే వచ్చాయి. నదీమ్‌ బౌలింగ్‌లో లాఫ్టెడ్‌ షాట్‌తో సిక్స్‌ కొట్టి స్పీడు పెంచిన ఏబీ మరో షాట్‌ ఆడి డీప్‌ కవర్‌లో అభిషేక్‌కు చిక్కాడు. ఆ వెంటనే ఫిలిప్‌ను ఔట్‌ చేసిన రషీద్‌ ఆర్‌సీబీని 76/4తో కష్టాల్లోకి నెట్టాడు. ఈ టైమ్‌లో గుర్‌కీరత్‌ (15 నాటౌట్‌) తో కలిసి వాషింగ్టన్‌ సుందర్‌ (21) ఒక్కో పరుగు జత చేస్తూ స్కోరు వంద దాటించాడు. ఇద్దరూ క్రీజులో కుదురుకోవడంతో ఆర్‌సీబీ కనీసం 130 రన్స్‌ చేసేలా కనిపించింది. కానీ, చివర్లో పేసర్లు మళ్లీ విజృంభించారు. రెండు ఫోర్లతో స్పీడు పెంచిన సుందర్‌ను18 ఓవర్లో నటరాజన్‌ ఔట్‌ చేసి దెబ్బ కొట్టాడు. తర్వాతి ఓవర్లో మోరిస్‌ (3), ఉడాన (0) వికెట్లు తీసిన హోల్డర్‌ ఐదు పరుగులే ఇచ్చాడు. లాస్ట్‌ ఓవర్లో నటరాజన్‌ నాలుగే ఇవ్వడంతో ఆర్‌సీబీ 120 రన్స్​కే పరిమితమైంది.

స్కోరు బోర్డు

బెంగళూరు: ఫిలిప్‌‌ (సి) పాండే (బి) రషీద్‌‌ 32, పడిక్కల్‌‌ (బి) సందీప్‌‌ 5, కోహ్లీ (సి) విలియమ్సన్‌‌ (బి) సందీప్‌‌ 7, డివిలియర్స్‌‌ (సి) అభిషేక్‌‌ (బి) నదీమ్‌‌ 24, సుందర్‌‌ (సి అండ్‌‌ బి) నటరాజన్‌‌ 21, గుర్‌‌కీరత్‌‌ (నాటౌట్‌‌) 15, మోరిస్‌‌ (సి) వార్నర్‌‌ (బి) హోల్డర్‌‌ 3, ఉడాన (సి) విలియమ్సన్‌‌ (బి) హోల్డర్‌‌ 0, సిరాజ్‌‌ (నాటౌట్) 2; ఎక్స్‌‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 120/7; వికెట్ల పతనం: 1–13, 2–28, 3–71, 4–76, 5–106, 6–113, 7–114; బౌలింగ్‌‌: సందీప్‌‌ 4–0–20–2, హోల్డర్‌‌ 4–0–27–2, నటరాజన్ 4–0–11–1, నదీమ్‌‌ 4–0–35–1, రషీద్‌‌ 4–0–24–1.

హైదరాబాద్‌‌: వార్నర్‌‌ (సి) ఉడాన (బి) సుందర్‌‌ 8, సాహా (స్టంప్డ్‌‌) డివిలియర్స్‌‌ (బి) చహల్‌‌ 39, పాండే (సి) మోరిస్‌‌ (బి) చహల్‌‌ 26, విలియమ్సన్‌‌ (సి) కోహ్లీ (బి) ఉడాన 8, అభిషేక్‌‌ (సి) గుర్‌‌కీరత్‌‌ (బి) సైనీ 8, హోల్డర్‌‌ (నాటౌట్‌‌) 26, సమద్‌‌ (నాటౌట్‌‌) 0; ఎక్స్‌‌ట్రాలు: 6; మొత్తం: 14.1 ఓవర్లలో 121/5; వికెట్ల పతనం: 1–10, 2–60, 3–82, 4–87, 5–114; బౌలింగ్‌‌: మోరిస్‌‌ 2–0–19–0, సుందర్‌‌ 3–0–21–1, సైనీ 2–0–30–1, సిరాజ్‌‌ 1–0–12–0, చహల్‌‌ 3.1–0–19–2, ఉడాన 3–0–20–1.

Tags:    

Similar News