ఉమ్మడి వరంగల్ జిల్లాలో మండుతున్న ఎండలు
*వారం రోజులుగా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Summer Effect: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం పది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. మే నెల చివరి వారంలో భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రాత్రి పూట చల్లటి గాలులు వీస్తున్నపటికీ తెల్లారింది అంటే చాలు ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మే నెల ఆరంభం నుంచే క్రమంగా పెరుగుతూ వచ్చిన ఉష్ణోగ్రతలు గత వారం రోజులుగా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.
ఉదయం 7 గంటలకే వడ గాలులు మొదలవుతున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు వేడి మరింతగా పెరిగిపోయి ఉక్కపోతతో ప్రజల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ఉగ్రరూపంతో అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి.
అత్యవసరం అయితేనే బయటకు రావాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతతో కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, శీతల పానీయాలకు గిరాకీ పెరిగింది. తప్పని పరిస్థితిలో ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లాలి కాబట్టి ఈ ఎండలకు ఉపశమనంగా జ్యూసులు, కొబ్బరిబొండాలు విపరీతంగా తాగాల్సి వస్తుందంటున్నారు వరంగల్ నగర వాసులు.