నేరెడ్‌మెట్‌లోని కాకతీయ నగర్‌లో గత గురువారం సాయంత్రం తప్పిపోయిన 12 ఏళ్ల బాలిక సుమేధ ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె తల్లిదండ్రులు సోమవారం నేరేడ్‌మెట్ పోలీసులను కలిసి తమ పాప చావుకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరింది. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. వీరందరిపై ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేయాలని ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారు.
కాగా గురువారం రాత్రి సైకిల్‌పై బయటకు వెళ్లిన సుమేధ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బండచెరువులో బాలిక మృతదేహం లభ్యం అయ్యింది. అప్పటివరకు తమ పాపా ఏదో ఓ చోట క్షేమంగా ఉంటుందని అనుకున్న తల్లిదండ్రులు. కానీ ఆ మృతదేహాన్ని 5 వ తరగతి విద్యార్థి సుమేధగా గుర్తించారు.
ఇంతలో భారీ వర్షాల తరువాత దీన్ దయాల్ నగర్ లోని నాలాలన్నీ నీటితో నిండిపోయాయని స్థానిక నివాసితులు పోలీసులకు తెలిపారు. తరువాత, బాలిక సైకిల్‌ను నాలా సమీపంలో పోలీసులు గమనించి, బాలికను కనిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించిన జిహెచ్‌ఎంసి, రెస్క్యూ టీం అధికారులను అప్రమత్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత అధికారులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. అనంతరం చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.