సుబ్బారావు బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ

Avula Subbarao: బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో సుబ్బారావు పిటిషిన్

Update: 2022-06-28 03:04 GMT

సుబ్బారావు బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ

Avula Subbarao: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న ఆవుల సుబ్బారావు బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం సైన్యంలో భర్తీ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఆగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో విధ్వంసం సృష్టించారు. అల్లర్లలో తన పాత్ర లేదని సుబ్బారావు పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఆర్మీలో పనిచేసిన తాను.... యువతను సైన్యంలో చేరేలా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సుబ్బారావు పిటిషన్‌లో తెలిపారు.

రెండు రోజుల క్రితం సుబ్బారావుతో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. విధ్వంసం కేసులో సుబ్బారావు ప్రధాన కుట్రదారని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్ గా పనిచేసిన సుబ్బారావు... 2011లో పదవీ విరమణ పొందాడని... 2014లో సాయి డిఫెన్స్ అకాడమీ స్థాపించి... ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావాలనుకునే యువతకు శిక్షణ ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. అగ్నిపథ్ పథకం వల్ల డిఫెన్స్ అకాడమీలన్నీ నష్టపోతాయనే దురుద్దేశంతోనే.. సుబ్బారావు, యువకులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో విధ్వంసం చేయించాడని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఘటన జరగడానికి ఒకరోజు ముందు, సుబ్బారావు మరియు అతని సహచరులు అనేక వాట్సాప్ గ్రూపులను సృష్టించారని.... ఉద్యోగ అభ్యర్థులను సికింద్రాబాద్‌కు రావాలని కోరారినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆయన కూడా నర్సరావుపేట నుంచి వచ్చి ఇక్కడే ఓ లాడ్జిలో బస చేశారు. సుబ్బారావు అనుచరులు.. తొలుత నిరసన చేపట్టేలా ఉద్యోగ ఔత్సాహికులతో సమన్వయం చేసి, ఆ తర్వాత వారిని హింసకు ప్రేరేపించారని తెలిపారు పోలీసులు. అయితే.. రైల్వే స్టేషన్‌లో హింస ప్రారంభమైన వెంటనే అతను తన స్వగ్రామానికి పారిపోయాడని... సికింద్రాబాద్ GRP పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తర్వాత కోర్టు పోలీసులకు నోటీసులు ఇవ్వనుంది. పోలీసుల తరఫు న్యాయవాది... ఆవుల సుబ్బారావు పాత్రపై తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు.

Tags:    

Similar News