Stray Dogs: హైదరాబాద్, వరంగల్ ఘటనలు మరువక ముందే... మరో రెండు చోట్ల పిల్లలపై వీధికుక్కల దాడి
Stray Dogs: వేములవాడలో సంజయ్ అనే బాలుడిపై నాలుగు కుక్కల దాడి
Stray Dogs: తెలంగాణలో కుక్కల దాడులు ఆగడం లేదు. పసి ప్రాణాలు పోతుంటే నష్టపరిహారం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప కుక్కులను అరికట్టేందుకు సరైన ప్రణాళికలు రచించడం లేదు. దీంతో చిన్నపిల్లలపై రాష్ట్రవ్యాప్తంగా కుక్కల దాడులు పెరిగిపోయాయి.
మొన్న హైదరాబాద్, నిన్న వరంగల్ ఇవాళ ఖమ్మం, కరీంనగర్... ప్రాంతం ఏదైనా పసిపిల్లలపై వీధికుక్కల దాడులు ఆగడం లేదు. హైదరాబాద్, వరంగల్ ఘటనలు మరువకముందే ఖమ్మం, కరీంనగర్‌లో పిల్లలపై వీధికుక్కలు దాడి చేశాయి. వేములవాడలో సంజయ్ అనే బాలుడిపై నాలుగు కుక్కల దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా... ఒకే సారి నాలుగు కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీధికుక్కల స్వైరవిహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను అరికట్టడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇటు ఖమ్మం రోటరీనగర్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల దాడికి దిగాయి. వీధికుక్కదాడిలో బాలుడు గగన్‌కు తీవ్రగాయాలయ్యాయి. గగన్‌ను కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తొడ, నడుం భాగంలో తీవ్రగాయాలైనట్లు వైద్యులు గుర్తించారు.