Patnam Narender Reddy: విచారణకు రావాలని బొంరాస్ పేట పోలీసుల నోటీసులు
పట్నం నరేందర్ రెడ్డికి(Patnam Narender Reddy) బొంరాస్ పేట పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.
పట్నం నరేందర్ రెడ్డికి(Patnam Narender Reddy) బొంరాస్ పేట పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. 2025 జనవరి 2న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో కోరారు. ఈ ఏడాది అక్టోబర్ 25న రోటిబండతండాలో కాంగ్రెస్ నాయకులు శేఖర్ పై దాడి జరిగింది. పార్మా క్లస్టర్ ఏర్పాటును నిరసిస్తూ శేఖర్ పై అప్పట్లో గ్రామస్తులు దాడికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు ఆయనను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేయనున్నారు.
మరోవైపు లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతరులపై దాడికి ప్రయత్నించిన కేసులో పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతామని డిసెంబర్ 26న ఐజీ సత్యనారాయణ ప్రకటించారు.
ప్రతి బుధవారం బొంరాస్ పేట పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని పట్నం నరేందర్ రెడ్డితో పాటు నిందితులను కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 25న బొంరాస్ పేట వెళ్తూ పరిగితో పాటు బొంరాస్ పేటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ ను ఇరికించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను జైలు నుంచి జడ్జికి లేఖ రాశానని.. ఆ లేఖ ఆధారంగా కేటీఆర్ అరెస్ట్ నిలిచిపోయిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. .
కొడగంల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా క్లస్టర్ పై ప్రజాభిప్రాయసేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులపై గ్రామస్తులు దాడికి ప్రయత్నించారు. ఈ దాడి నుంచి కలెక్టర్ సహా అధికారులు తప్పించుకున్నారు. కడా అధికారి వెంకట్ రెడ్డిని గ్రామస్తులు కొట్టారు. దీనిపై నమోదైన కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో డిసెంబర్ 20న జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.
అరెస్ట్ సమయంలో తాను ఇచ్చినట్టుగా చెబుతున్న స్టేట్ మెంట్ తనది కాదని కూడా అప్పట్లోనే నరేందర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు ఏదో స్టేట్ మెంట్ రాసుకొని తన సంతకం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.