Drugs in Gachibowli Pub: హైదరాబాద్ పబ్బులో డ్రగ్స్ కలకలం... 8 మందికి పాజిటివ్
Drugs in Gachibowli Pub: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని క్వాక్ అరెనా పబ్బులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. పబ్బులో డీజే వీరికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. రైడ్‌లో పట్టుబడిన వారిని నార్కోటిక్ బ్యూరో సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ సరఫరాపై నిఘా పెంచారు. ఈ క్రమంలోనే క్వాక్ అరెనా పబ్బులో డ్రగ్స్ తీసుకున్న వారు పట్టుబడ్డారని సమాచారం అందుతోంది.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఈవెంట్స్ పై పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఈవెంట్స్ పై పోలీసుల ఆంక్షలు విధించారు. 43 కమ్యూనిటీ ఈవెంట్స్‌కు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. మాదాపూర్ జోన్ పరిధిలో 61 ఈవెంట్స్, 43 పబ్స్ ఉన్నాయని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
ఇలాంటి వేడుకలు జరిగే సమయాల్లో మైనర్స్ డ్రింక్ చేయకుండా చూసుకోవడం, ట్రాఫిక్ సేఫ్టీ చూసుకోవడం, మహిళల రక్షణ చూసుకోవడం చాలా ముఖ్యం అని డీసీపీ వినీత్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లోనే డ్రగ్స్ వినియోగం పెరిగే ప్రమాదం ఉంటుందని.. కానీ గట్టి నిఘా పెట్టి డ్రగ్స్ వినియోగం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు వచ్చిన వారు తాగి వాహనాలు నడపకుండా పబ్ నిర్వాహకులే చర్యలు తీసుకోవాలని డీసీపీ వినీత్ సూచించారు.
టైమ్ - సౌండ్ రూల్ పాటించాలి
టైమ్ దాటిపోతున్నప్పటికీ భారీ శబ్ధాలతో డీజేలు మోగించడం లాంటివి చేయొద్దని మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్చరించారు. చుట్టూ ఉన్న వారికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. 100 - 200 మంది నుండి 8 వేల మంది అతిథులు పాల్గొనే స్థాయిలో ఈవెంట్స్ నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ప్లాన్స్ చేసుకుంటున్నాయని చెప్పారు.