భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం
* పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Sri Seetharama Kalyanam: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాములోరి కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వివరించారు వేద పండితులు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా స్టేడియంలో కల్యాణ వేడుక జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పురవీధులు మార్మోగాయి. అభిజిత్ మూహుర్తాన అర్చకులు.. సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. సీతమ్మకు మాంగళ్యధారణ చేశారు. సీతారాములను వధూవరులుగా చూసి భక్తులు తరించారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముంతు భక్తుల కోలాహలం, మంగళవాద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చారు. స్టేడియంలోని కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ఉంచి సీతారాముల కల్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు.