KCR: 'మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి, కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తాం'...
KCR: కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్ షోలతో బీఆర్‌ఎస్‌లో జోష్
KCR: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త వెనుకంజగా కనిపించిన కారు పార్టీలో తిరిగి కొత్త జోరు కనిపిస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా.. కొందరు నేతలు పార్టీని వీడటం, ఎంపీలు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల తరఫున లోక్‌సభ అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం కనిపించిందని అంటున్నాయి. కానీ కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, తన ప్రసంగాల్లో కాంగ్రెస్, బీజేపీలపై సంధిస్తున్న విమర్శనాస్త్రాలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో మునపటి ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలకు బదులు క్షేత్రస్థాయి కార్యక్రమాలకే కేసీఆర్ మొగ్గుచూపారు. ఈ మేరకు ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజులపాటు బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో మంచి స్పందన కనిపించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కేసీఆర్‌కు మహిళలు మంగళ హారతులు, డప్పులు, బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలుకుతున్నారని.. బస్సుయాత్ర సాగే మార్గంలో రైతులు, యువకులు కేసీఆర్‌ను చూసేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల కోసం పార్టీ పరంగా జన సమీకరణ చేస్తున్నా.. అంచనాలకు మించి జనం వస్తున్నారని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బస్సుయాత్రలో భాగంగా మార్గమధ్యలో రైతులతో, వివిధ వర్గాలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. రోడ్డు పక్కన హోటళ్ల వద్ద ఆగి చాయ్ తాగుతూ, స్థానికులతో మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. రైతులతో ముచ్చటిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.. తాను చేస్తున్న పోరాటంలో కలసి రావాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రోడ్ షోలు ముగిసిన తర్వాత కేసీఆర్ స్థానికంగా బస చేస్తున్నారు. ఆ సమయంలో, మరుసటి రోజు ఉదయం.. స్థానిక నేతలు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన వారితో మాట్లాడుతున్నారు. స్థానికంగా ముఖ్య నేతల నివాసానికి వెళ్లి కలుస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజలను మరింతగా ఆకట్టుకుంటున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం.. తన ప్రసంగాల్లో వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండటం ఆకట్టుకుంటోందని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ, రైతుబంధు, వరికి రూ.500 బోనస్, విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలను ఎత్తిచూపుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో తాము చేపట్టిన చర్యలను వివరిస్తూ.. కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు జోష్ నింపుతున్నాయని అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని చెప్పడం ప్రభావం చూపుతోందని చెప్తున్నాయి.
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్‌ఎస్‌కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని వివరిస్తున్నాయి. ఇలా కేసీఆర్ ప్రచారం బీఆర్ఎస్ పై ప్రజల్లో పాజిటివ్ దృక్పదం పెంచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.