ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత ఇంట గెలిచి రచ్చ గెలవాలి. బయట ఎంత పేరున్నా సొంత కుటుంబంలో గొడవలకు ఈ సామెతలు తార్కాణం. ప్రస్తుతం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా, ఇవే సమస్యలతో సతమతమవుతున్నారట. అందుకే ఆపరేషన్ ప్రక్షాళన మొదలుపెట్టారట. తనకు చెక్‌పెట్టాలని స్కెచ్ వేస్తున్న కొందరికి, స్కెచ్ రెడీ చేశారట బండి. ఇంతకీ ఏంటా స్కెచ్?
తెలంగాణ బీజేపీని బలోపేతం చేసి టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ గా ఎదగాలంటే ముందు స్వంత పార్టీలోనే ప్రక్షాళన అవసరమని సంజయ్ భావిస్తున్నారట. పార్టీలో సీనియర్ల వారసులుగా పదవులు అనుభవిస్తూ పార్టీకి నష్టం చేస్తున్న వారిని గుర్తించి వారికి చెక్ పెట్టేందుకు సంజయ్ సిద్ధమయ్యారట. పార్టీకోసం నిజంగా కష్టపడి పని చేసే వారు తన మద్దతుదారులకు సంస్థాగత పదవులు అప్పగించి తన మార్క్ చూపెట్టే పనిలో ప్రస్తుతం సంజయ్ ఉన్నారట.
సాధారణంగా పార్టీ అధ్యక్ష పదవి దక్కినవారు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసి, వారిని ఎన్నికల్లో దెబ్బతీసేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. కానీ సంజయ్ మాత్రం, కాషాయ బాధ్యతలు చేపట్టిన తర్వాత, సొంత పార్టీలోనే ప్రక్షాళన మొదలుపెట్టారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ఏమాత్రం సహించని, ఏళ్లకు ఏళ్లుగా పార్టీలో వున్న కొంతమందిపై కాన్‌సన్‌ట్రేట్ చేశారు. తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొత్త నాయకత్వానికి చోటివ్వకుండా పావులు కదుపుతున్న కొందరు సీనియర్లు, వారి అనుచరగణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట సంజయ్.
నిజానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన సంజయ్‌కి, పార్టీలో సీనియర్లు పెద్దగా సహకరించట్లేదని పార్టీలో ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు. అయితే పార్టీలో తన మార్క్ చూపెట్టాలంటే, ముందు ప్రస్తుత టీంలో భారీ మార్పులు చేయాలని సంజయ్ భావిస్తున్నారట. దీంతో జిల్లా అధ్యక్షులతో పాటు ఇతర కమిటీల నియామకాల్లో తన టీమ్‌ను రంగంలోకి దించుతున్నారట సంజయ్. అదే ఇప్పడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.
పాలక పక్షంపై దూకుడుగా ముందుకు వెళ్తూనే, పార్టీలో తన పట్టు సాధించేందుకు సంజయ్ స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నారని పార్టీలో టాక్. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం కోసం, సంజయ్ గత సారథులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారట. గతంలో అధ్యక్షుడి నియామకం సీనియర్ల సూచనల మేరకు జరిగేదట. దీంతో పలువురు సీనియర్లు తమ అనుచరులకు పదవులు అప్పగించేవారట. అందుకే నిజంగా పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం జరగలేదని సంజయ్ అభిప్రాయపడ్తున్నారట. ఇలాంటి వాటికి చెక్ పెట్టి, ఇటీవలి కాలంలో 7 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించి, సీనియర్లకు ఒకరకంగా షాకిచ్చారు సంజయ్.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోనైతే కొందరు సీనియర్లదే హవా. దీంతో గ్రేటర్‌లోనూ ప్రక్షాళనకు శ్రీకారం చుడతారట సంజయ్. త్వరలోనే జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో, సిటీపై స్పెషల్ గానే ఫోకస్ పెట్టినట్లు వినికిడి. ప్రస్తుత గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రామచందర్ రావు గడువు ముగియడంతో, కొత్తవారిని నియమించాల్సిన అవసరం ఉంది. దీంతో ఇదే చాన్సుగా, సీనియర్ల అనుచరులకు కాకుండా, పార్టీ కోసం కష్టపడేవారికి చోటివ్వాలని డిసైడయ్యారట బండి. అందులో భాగంగానే గ్రేటర్ అధ్యక్షుడి విషయంలో, అవసరమైతే మూడు లేదా నాలుగు విభాగాలుగా చేసి కమిటీలను వేయాలని భావిస్తున్నారట. అలాగే జీ.హెచ్.ఎం.సీ పరిధిలో రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలకు వేరువేరుగా కమిటీలు వేసేందుకు కసరత్తు చేస్తున్నారట. ఈ దెబ్బతో హైదరాబాద్ సీనియర్ నేతలకు చెక్ పెట్టినట్టేనని భావిస్తున్నారట సంజయ్.
మొత్తమ్మీద, ముందు ఇంట గెలిచి రచ్చ గెలువాలని చూస్తున్నారట బండి సంజయ్. అందుకోసం పార్టీలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారట. సీనియర్లను ఏమాత్రం పరిణగలోకి తీసుకోకుండా, తన మార్క్ వుండాలని తపనపడుతున్నారట. ఇదే కాకలు తీరిన కాషాయ నేతలకు మింగుడుపడటం లేదట. చెక్‌పెట్టి దారిలోకి తెచ్చుకుందామనుకుంటే, తమ హవాకు ఎసరుతెచ్చేలా స్కెచ్ వేస్తున్నారని టెన్షన్ పడుతున్నారట. మరి సంజయ్ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.