Sitaram Yechury: భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన తెలుగు యోధుడు

Update: 2024-09-12 10:58 GMT

సీతారాం ఏచూరి.. తెలుగు వారికే కాదు, జాతీయ రాజకీయాల గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న వారికి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎర్ర జెండా పట్టుకుని ఎన్నో ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించిన నాయకుడు ఆయన. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఏచూరి కొద్ది కాలంలోనే జాతీయ స్థాయికి ఎదిగారు.

కమ్యూనిస్టు సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉంటూనే ఇతర రాజకీయ పక్షాలకు కూడా ఒక థింక్ ట్యాంక్‌లాగా కనిపించడం ఒక్క సీతారాం ఏచూరికే సాధ్యమైందని చెప్పవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఎర్ర జెండాను నమ్ముకున్న యువతరానికి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఉద్యమ పంథాను అనుసరించిన నాయకుడే అయినప్పటికీ, గొంతు చించుకుని అటెన్షన్ గ్రాబ్ చేసే లక్షణాన్ని ఆయన ఏనాడూ ప్రదర్శించలేదు. సౌమ్యంగా మాట్లాడుతూనే నిక్కచ్చిగా ఆలోచనలు పంచుకోగలగడం ఆయన ప్రత్యేకత. దాదాపు అర్థ శతాబ్దం పాటు కమ్యూనిస్టు వర్గాలలోనే కాదు, దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపిన రాజకీయవేత్తే సీతారాం ఏచూరి.

సీతారాం నేపథ్యం...

సీతారాం ఏచూరి 1952 ఆగస్ట్ 12న మద్రాసులో జన్మించారు. అయితే, ఆయన పెరిగింది మాత్రం చాలావరకు హైదరాబాద్‌లోనే. ఆయన పుట్టిన నాలుగేళ్లకే రాష్ట్రాల పునర్విభజన జరిగింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలతో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. దాంతో, మద్రాసులోని తెలుగు వారు చాలా మంది ఏపీకి వచ్చారు. సీతారాం యేచూరి తాతగారు అప్పట్లో మద్రాసులో లా ప్రాక్టీస్ చేసేవారు. ఆ తరువాత ఆయన గుంటూరుకు జడ్జిగా వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు ఆయనతో పాటే సీతారాం ప్రయాణం సాగింది.

హైదరాబాద్‌లో తాత-అమ్మమ్మల వద్ద ఉంటూనే ఆయన తన పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. 1968 లో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయినప్పుడు హైదరాబాద్‌లో తెలంగాణ తొలిదశ ఉద్యమం మొదలైంది. అదే సమయంలో రవాణా శాఖలో ఆటోమొబైల్ ఇంజనీర్‌గా ఉన్న సీతారాం ఏచూరి తండ్రికి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అయింది. తెలంగాణ ఉద్యమం వల్ల కుమారుడి చదువు దెబ్బతింటుందని భావించిన సీతారాం తండ్రి.. ఆయనను ఢిల్లీకి పిలిపించుకున్నారు. అలా సీతారాం ఏచూరి మిగతా ఉన్నత చదువుల కోసం ఢిల్లీ ట్రైన్ ఎక్కారు.

ఎర్ర జెండా పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే..

హైదరాబాద్‌ నిజాం కాలేజి విద్యార్థిగా ఉన్నప్పుడే కులాల కుమ్ములాటలు, నిరుద్యోగ సమస్య వంటివి ఆయనను తీవ్రమైన ఆలోచనకు గురి చేశాయి. తమ తాతలు, తల్లిదండ్రులు, మేనమామ.. ఇలా ఇంట్లో అందరూ విద్యావేత్తలే కావడంతో అవే ఆధునిక భావాలతో పెరిగిన ఏచూరి రాజకీయాలకు బాగా ఆకర్షితులయ్యారు.

మేనమామ మోహన్ కందా ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో సీతారాం ఏచూరిని కూడా కలెక్టర్‌గా చూడాలనేది వారి ఇంట్లో పెద్దల ఆశ. కానీ, సామాజిక చైతన్యం, తిరుగుబాటు మనస్తత్వం అలవర్చుకున్న సీతారాం.. కార్మికులు, కర్షకులు, కష్ట జీవుల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు ఉద్యమాలే మార్గమని భావించారు. ప్రజల పక్షాన నిలిచేందుకు ఎర్ర జెండా పట్టుకుని కామ్రేడ్‌గా అవతరించారు.

సీతారాం ఏచూరిని రాటుదేల్చిన 'ఎమర్జెన్సీ'

సీతారాం ఏచూరి కమ్యూనిస్ట్ పార్టీలో చేరి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న తొలినాళ్లలోనే కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. అప్పట్లో దేశం నలుమూలలా ఎంతో బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. ఈ క్రమంలోనే చాలామంది కమ్యూనిస్ట్ నాయకులతో పాటే సీతారాం ఏచూరి కూడా జైలుపాలయ్యారు. ఇద్దరు తాతల్లో ఒకరు జడ్జి కాగా, మరొకరు తహశీల్దార్ కావడం.. తండ్రి ఇంజనీర్ కావడంతో ఈ అరెస్టులు, జైళ్లు మనకెందుకొచ్చిన తలనొప్పి వెనకొచ్చేయమని అన్నారట. కానీ, కామ్రేడ్ సీతారాం ఏచూరి మాత్రం అప్పటికే ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరాటాలతో మరింత రాటుదేలిపోయారు. కమ్యూనిస్టులతో కలిసి అనుభవించిన జైలు జీవితంలోనే మరిన్ని పాఠాలు ఒంటబట్టించుకున్నారు. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా ఎర్ర బాటే తన దారి అని నిర్ణయించుకున్నారు.

నా మనవణ్ణి నాకిచ్చేయమని సుందరయ్యతో గొడవపెట్టుకున్న అమ్మమ్మ..

సీతారాం ఏచూరి యువకుడిగా కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన రోజులవి. అప్పటికే ఇండియాలో సీపీఐ(ఎం) స్థాపకుల్లో ఒకరైన తొలితరం కమ్యూనిస్ట్ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య తమ కమ్యూనిస్టు పోరాటాలను ముందుకు తీసుకెళ్లే యువతరం కోసం అన్వేషిస్తున్నారు. అదే సమయంలో సీతారాం ఏచూరి ఆయన కంటపడ్డారు. సీతారాం ఏచూరిలో చురుకుతనం చూసి పార్టీలో ఆయన్ని ప్రోత్సహించారు. కానీ, సీతారాం పోరాటాల బాట పట్టి కెరీర్ నాశనం చేసుకుంటున్నాడు అనే ఆవేదనలో ఉన్న వాళ్ల అమ్మమ్మ ఇదే విషయమై ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్యను నిలదీశారట. నా మనవణ్ణి వదిలేసి ఆ స్థానంలో ఇంకెవరినైనా చూసుకొమ్మని చెప్పారట. అందుకు పుచ్చలపల్లి సుందరయ్య కూడా అంతే తెలివిగా స్పందిస్తూ, "నీ మనుమడి లాంటివాడిని నాకు ఇంకొకరెవరైనా ఉంటే ఇవ్వండి.. అలాగే వదిలేస్తాను" అని అన్నారట. సుందరయ్య అన్న ఆ ఒక్క మాటతో సీతారాం ఏచూరి వాళ్ల అమ్మమ్మ ఇక సైలెంట్ అయిపోయారట. అంతేకాదు, "నా మనవడు లాంటివాడు ఇంకొకరు దొరకరు అనేది సుందరయ్య అభిప్రాయం" అని అర్థమయ్యాక ఇక ఎన్నడూ సీతారాంని ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఒకానొక సందర్భంలో సీతారాం ఏచూరి స్వయంగా పంచుకున్న జ్ఞాపకం ఇది.

ఎంఏ, పీహెచ్‌డి చదువుల కోసం ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చేరడం సీతారాం ఏచూరి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండాల్సి రావడంతో.. తను కూడా అక్కడే ఉంటూ యూనివర్శిటీ వేదికగా తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు. అప్పటికే కమ్యూనిస్ట్ భావజాలంతో ముందుకెళ్తున్న సీతారాం ఏచూరీకి, అక్కడ జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తోన్న కమ్యూనిస్టు యోధులతో పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమక్రమంగా ఆ ఆలోచనలు, పరిచయాలే తనని పూర్తి కమ్యూనిస్టుగా మార్చేశాయనేది సీతారాం ఏచూరీ మాట.

ఆ మాటంటే అస్సలే ఒప్పుకోని ఏచూరి..

మారుతున్న రోజులు, లైఫ్ స్టైల్, పాలిటిక్స్ వైపు ఆసక్తిలేని యువతను మీరు కమ్యూనిస్ట్ వైపు ఎలా తిప్పుకుంటారు? దేవుడినే నమ్ముకున్న జనాన్ని, దేవుడంటే నమ్మని కమ్యూనిస్టువైపు ఎలా ఆకర్షిస్తారు? ఓట్లు, సీట్లతోనే అధికారం తెచ్చుకుంటేనే దేశాన్ని మార్చగలుగుతారు కదా.. మరి ఓట్లు తెచ్చుకోలేకపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు దేశాన్ని ఎలా మార్చుతారు? బీజేపిని గద్దెదించాలి గద్దెదించాలి అని పోరాడి పోరాడి.. పరోక్షంగా బీజేపికి మేలు చేస్తున్నట్లు అనిపించడం లేదా అని మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు సీతారాం ఏచూరి చెప్పే సమాధానం ఒక్కటే : మారుతున్న రోజుల కంటే.. మారుతున్న జీవన శైలి కంటే.. సమాజంలోని ఆర్థిక దోపిడి, సామాజిక దౌర్జన్యం, మతోన్మాద ఘర్షణలే నేటితరంపై ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే, బీజేపీతో మా పోరాటం కొనసాగుతుంది. ఒక నరేంద్ర మోదీ, ఒక నీరవ్ మోదీ, ఒక లలిత్ మోదీ.. ఇలా ఇంతమంది మోదీలు దేశాన్ని దోచుకుంటున్నారు కనుకే.. మోదీని గద్దె దించేందుకు పోరాటం చేస్తున్నాం.

కాకినాడతో ఏచూరికి ఉన్న అనుబంధం..

సీతారాం ఏచూరి తల్లి కల్పకం, తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఇద్దరూ కాకినాడకు చెందినవారే. దీంతో చిన్నప్పటి నుండి సెలవులకు హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్ళి వస్తుండేవారు. ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి కొన్నిరోజులైనా కాకినాడలో గడిపి వెళ్లడం తనకు ఇష్టమనేవారు ఏచూరి. ముఖ్యంగా ఢిల్లీలో చలి బాగా అధికంగా ఉన్న సందర్భంలో అమ్మని తీసుకుని హైదరాబాద్‌కు, కాకినాడకు వచ్చేవాళ్లం అని ఏచూరి తనకు కాకినాడతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.

22 ఏళ్ళకే ఎస్ఎఫ్ఐలో చేరి, ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని రాజకీయంగా అంచలెంచెలుగా ఎదిగిన ఏచూరి సీతారాం 1992 నుంచి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2015లో పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ప్రజా క్షేత్రంలోనే జీవితమంతా గడిపిన సీతారాం ఏచూరి.. సైద్ధాంతిక రాజకీయాలకు చివరి తరం ప్రతినిధి.

Tags:    

Similar News