Kadamba Tree: కనువిందుగా.. కదంబవృక్షం
Kadamba Tree: సరస్వతి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ వృక్షం
Kadamba Tree: ఏడాదిపొడవునా ఆకుపచ్చగా ఉండే ఆ వృక్షమంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఆ చెట్లవనం ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లివిరుస్తుందని ప్రతీతి. అమ్మవారికి..ఆ వృక్షాలకి లింకేంటీ ఆనుకుంటున్నారా. అయితే ఈ విషయం తెలుసుకోవాలంటే మనం చదువుల తల్లికొలువు తీరిన నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి వెళ్ళాల్సిందే. మన సంస్కృతి సంప్రదాయాలలో మొక్కలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగిన మొక్కలలో కదంబ ఒకటి.
ఈ కదంబ మొక్కనే రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అంటూ పూజలు చేస్తారు. అదేవిధంగా హనుమంతుడు పుట్టుకకు కారణం కూడా ఈ మొక్క అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల చీరలను దొంగలించి దాచింది కూడా ఈ వృక్షంలోనే అంటుంటారు. అయితే చదువుల తల్లిగా పిలువబడే బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇక్కడ వేలాదిగా వెలిసిన కదంబ వృక్షాలు కనువిందు చేస్తాయి. బాసర పుణ్యక్షేత్రంలోని ముఖద్వారంతో ప్రారంభమయ్యే ఈ వృక్షాలు బాసరలో అడుగడుగునా కనిపిస్తాయి.
బాసర ప్రధాన రహదారులతో పాటు ఆలయ ప్రాంగణం, గోదావరి నదీ తీరంవరకు కదంబ మొక్కలు కనిపిస్తుంటాయి. ఇలా ఎక్కడ చూసిన పచ్చదనాన్ని కమ్ముకుని కనువిందుచేస్తున్నాయి.యేడాది పొడవునా ఆకులు రాలకుండా, ఎ క్కడ కూడా ఎండు ఆకులు కనపడకుండా ఉంటాయి. అయితే ఏడాది పొడవునా పచ్చగా ఉండే ఈ చెట్లంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని చెప్పుకుంటారు. సరస్వతీ దేవి పసిప్రాయంలో కదంబవృక్షాలు ఉన్న ప్రాంతంలో ఆటలాడుకునేదని, లలిత సహాస్రనామాల్లో సైతం దేవి కదంబవనంలో సంచరించినట్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కదంబ వృక్షాలంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రం.
అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రాంతంలో విరివిగా కదంబ వృక్షాల పెంపకం చేపట్టడం జరిగింది. సుమారు 5 వేలకు పైగా కదంబ వృక్షాలున్నట్లుగా నిర్వహకులు పేర్కొంటున్నారు.ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి భగవద్గీత, మహాభారతంలో కూడా ప్రస్తావించారు. కదంబ వృక్షం చూడటానికి ఎంతో పెద్దగా ఉండి ఈ పూలు గుండ్రని ఆకారంలో కలిగి ఉంటాయి. ఈ పుష్పాలను ఎక్కువగా లలితాదేవి పూజలో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ వృక్షాన్ని ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తారు. అన్ని రకాల వృక్షాలు మాదిరిగా ఈ చెట్టు ఆకులురాలవు ఎల్లప్పుడూ పచ్చగానే కనిపిస్తుంది.
వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులను సైతం ఈ చెట్లు కనువిందు చేస్తున్నాయి. సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గతంలో పివి. నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించడంతో పాటు ఇక్కడ ఓ కదంబ వృక్షాన్ని ఆయన చేతులమీదుగా నాటారు. అయితే నేటికి ఆ వృక్షం ఆలయ ప్రాంగణంలో కనిపించడంతో పాటు భక్తుల పూజలందుకోంటోంది.