Hyderabad: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర

Hyderabad: గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు శోభాయాత్ర

Update: 2024-04-23 07:08 GMT

Hyderabad: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర

Hyderabad: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభమైంది. హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిటీలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలు సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. దీంతో వీర హనుమాన్ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయానికి వీర హనుమాన్ ర్యాలీ చేరుకోనుంది. ఈ క్రమంలో బోయిన్‌పల్లి, తాడ్‌బంద్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ శోభాయాత్ర సాగే ప్రాంతాల్లోనూ ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు పోలీసులు. హనుమాన్ శోభాయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌలిగూడా నుంచి తాడ్‌బండ్ వరకు శోభాయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో

శోభాయాత్రకు టాస్క్‌ఫోర్స్ పోలీస్‌తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బన్సీలాల్ పేట్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర సాగనుంది. దాదాపు 13 కిలో మీటర్ల మేర శోభాయాత్ర కొనసాగునుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా 44 చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని పోలీసులు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News