నీలాకాశంలో అద్భుతాలు గగన వీధిలో ఒళ్లు గగుర్పొడిచేలా సాహస విన్యాసాలు పైలట్లు పారామోటార్ నుంచి పారాచూట్‌లు వేసుకొని స్కై డైవింగ్‌లు చేస్తూ అబ్బురపరిచారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్‌లో ఐదు రోజుల పాటు నిర్వహించే ఎయిర్‌షో అండ్ పారామోటార్ చాంపియన్‌షిప్-2021 జాతీయ ఏరో స్పోర్ట్స్ ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. 10 రాష్ట్రాలకు చెందిన పారామోటార్ పైలట్లు ఈ పోటీలలో పాల్గొన్నారు.
దేశ విదేశీ న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారు. విదేశాల నుంచి న్యాయనిర్ణేతలు ఆన్‌లైన్ ద్వారా పోటీలను వీక్షించనున్నారు. మొదటి, రెండో స్థానంలో నిలిచిన వారిని ఎంపిక చేసి వారికి భవిష్యత్తులో జరుగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. స్టేడియంలో జరుగుతున్న పారామోటార్ పోటీలను వీక్షించేందుకు పాలమూరు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. విదేశాలకే పరిమితమైన పారామోటార్, హాట్ ఎయిర్‌బెలూన్, స్కై డైవ్, రిమోట్ పారామోటార్ పోటీలు దేశంలోనే మొదటిసారిగా మహబూబ్‌నగర్‌లో జరుగుతున్నాయి.
దేశంలోనే మొదటిసారి పారామోటార్, హాట్ ఎయిర్ బెలూన్, స్కై డైవ్ క్రీడలు జరగడం ఆనందంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్‌నగర్ యువత ఏరో స్పోర్ట్స్‌లో రాణించేందుకు, భవిష్యత్తులో వారిని పారామోటార్ పైలట్లుగా తీర్చిదిద్దేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. జిల్లాలోని ఉద్దండాపూర్, కర్వెన ప్రాజెక్టుల మధ్య ఏరోస్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ కోసం 15 ఎకరాలు కేటాయించామని శిక్షణ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.