Sanitation workers were moved in the garbage cart: పారిశుద్ధ్య కార్మికులను చెత్త బండిలో తరలించారు!

Sanitation workers were moved in the garbage cart: కరోనా సయమంలో మేమున్నాంటూ ముందు నిలిచి ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులపై వివక్ష కొనసాగుతూనే ఉంది

Update: 2020-08-24 05:08 GMT

Corona victims transported in garbage vehicle

కరోనా సయమంలో మేమున్నాంటూ ముందు నిలిచి ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ వచ్చిందని తెలిసిన తరువాత కనీసం వారిని ఇళ్లకు చేరవేసేందుకు అంబులెన్స్ సమకూర్చకపోవడం వల్ల వారు రోజువారీ విధులు నిర్వర్తించే చెత్త బండిలోనే చేరాల్సి వచ్చింది.

మానవత్వం మంటగలిసింది. ఆపదలో అండగా నిలవాల్సిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. ర్యాపిడ్‌ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలిన 9మంది పారిశుధ్య కార్మికులకు తాము రోజూ పనిచేసే చెత్తబండే(ట్రాక్టర్‌) అంబులెన్స్‌గా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో 120 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి దశల వారీగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే శనివారం శ్రీగిరిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారుల ఆధ్వర్యంలో 85 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 9మందికి పాజిటివ్‌గా తేలింది.

ఈ విషయాన్ని సంబంధిత అధికారులు మధ్యాహ్నం 12గంటల సమయంలో వారికి తెలియజేశారు. దీంతో ఆందోళనకు గురైన పారిశుధ్య కార్మికులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు సరైన విధంగా స్పందించలేదని సమాచారం. కార్మికులకు తలో రూ.500 చేతుల్లో పెట్టి చెత్త తరలించే ట్రాక్టర్‌లో ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచించి చేతులు దులుపుకున్నారు. దీంతో కార్మికులు చేసేదిలేక సాయంత్రం ట్రాక్టర్‌లో ఆర్వీఎం ఆస్పత్రి వద్దకు వెళ్లారు. అయితే ఆస్పత్రి సిబ్బంది వీరిని చేర్చుకోవడానికి నిరాకరించడంతో కార్మికులు ఆస్పత్రి ప్రాంగణంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు మైస రాములు, దళిత సంఘాల నాయకులు మున్సిపల్‌ కమిషనర్, చైర్మన్‌కు సమాచారం ఇచ్చి.. ఇదేం తీరంటూ ప్రశ్నించారు.

ఈ పరిణామంతో ఆలస్యంగా స్పందించిన మున్సిపల్‌ యంత్రాంగం, పాలకవర్గం పారిశుధ్య కార్మికులను రాత్రి 7గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్చుకునేలా చేశారు. కాగా, మున్సిపల్‌ అధికారుల తీరుపై గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమేగాకుండా ఆదివారం ఉదయం నుంచే మున్సిపల్‌ కార్యాలయం వద్ద తోటి కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన విషయం తెలుసుకొని కమిషనర్‌ కృష్ణారెడ్డి అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్‌లో పారిశుధ్య కార్మికులను తరలించిన ఘటనపై క్షమాపణ చెప్పడంతో ఆందోళనకారులు కొంత శాంతించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌చైర్మన్‌ జకియొద్దీన్‌లు సైతం మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో కార్మికుల ఆందోళన సద్దుమణిగింది. ఇదిలా ఉంటే చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిస్థితిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి తెలుసుకున్నారు. 

Tags:    

Similar News