Rythu Bandhu: ఇవాళ్టి నుంచి తెలంగాణలో రైతుబంధు పంపిణీ

Rythu Bandhu: 68.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

Update: 2022-06-28 03:41 GMT

Rythu Bandhu: ఇవాళ్టి నుంచి తెలంగాణలో రైతుబంధు పంపిణీ

Rythu Bandhu: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు పంపిణీకి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమకానున్నాయి. ఈ సీజన్‌కు రైతు బంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.10 లక్షలుగా ప్రభుత్వం లెక్క తేల్చింది. కొత్తగా భూములు రిజిస్ట్రేషన్స్ అయిన వారికి కూడా రైతు బంధు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. విడతల వారీగా జమ చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. గత సీజన్‌తో పోల్చితే లబ్ధిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఈ సీజన్‌లో రైతుబంధు పంపిణీ కోసం 7వేల 521.80 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ తెలిపింది. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతు బంధు జమ చేయనున్నది. రాష్ట్రంలో ఎకరం పొలం ఉన్న రైతులు 19.98 లక్షల మంది ఉన్నారు. వీరి ఖాతాల్లో ఇవాళ 586.65 కోట్లు జమ కానున్నాయి.

రైతులకు ప్రతీ ఏడాది ఖరీఫ్, రబీ కాలాల్లో పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి 10వేలు అందిస్తుంది. ఖరీఫ్‌కు ఎకరాకు 5వేలు, రబీ సీజన్‌కు ఎకరాకు 5వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదిలా ఉంటే గత సీజన్‌తో పోల్చితే ఈసారి 3.64 లక్షల మందికి పైగా రైతులకు కొత్తగా రైతుబంధు అందనున్నది. సుమారు 1.5 లక్షల ఎకరాల భూమి కొత్తగా జాబితాలో చేరింది. భూముల క్రయవిక్రయాలు, బదలాయింపు, కోర్టు కేసుల పరిష్కారాలు, వివాదంలోని పార్ట్‌-బీ జాబితాలోని భూ సమస్యల పరిష్కారం వంటి కారణాలతో రైతుల సంఖ్యతో పాటు భూమి కూడా పెరిగింది. గత యాసంగిలో సుమారు 63 లక్షల మంది రైతులకు చెందిన 1.48 కోట్ల ఎకరాలకు 7వేల 411.52 కోట్లు అందింది.

మరోవైపు ఇప్పటికే 50 వేల లోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. 50 వేల రూపాయలు పైన ఉన్న వారి డబ్బులను రుణమాఫీ చేయలేదు. దీంతో రైతు బంధు జమా కాగానే బ్యాంకులు కట్ చేసుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం SLBC అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News