Revanth Reddy on Delimitation: ఎంపీ సీట్ల పెంపుపై వివాదమేంటి? చంద్రబాబు, స్టాలిన్, రేవంత్ రెడ్డి ఏమన్నారు?
Revanth Reddy on Delimitation: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంపీ స్థానాల డీలిమిటేషన్ లో ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy on Delimitation: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంపీ స్థానాల డీలిమిటేషన్ లో ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన వారిని శిక్షిస్తోందన్నారు. లోక్ సభ సీట్లు, పన్నుల్లో తమ హక్కు వాటాను డిమాండ్ చేసేందుకు అన్ని దక్షిణాది రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సీఎం చెప్పారు.
అక్టోబర్ 25న హైద్రాబాద్ లో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబ నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్రం భావిస్తుందని ఆయన ఆరోపించారు. జనాభాను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలకు ప్రతిఫలం ఇవ్వాలని బీజేపీ భావిస్తోందన్నారు.
జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లు పెరిగితే దక్షిణాదికి నష్టం జరుగుతోందని ఆయన చెప్పారు.దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వృద్దాప్య జనాభా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ లు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను బలిపశువులను చేస్తే బలమైన పోరాటం చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కోరాను. కానీ, ఆయన తన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయంపై ఫోకస్ చేయలేదన్నారు.
డీలిమిటేషన్ లో అన్యాయంపై పోరాటం చేస్తా: రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల పంపిణీ, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా వాటా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్ సభ స్థానాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలను ఒకే వేదికపైకి తీసుకువస్తానని ఆయన చెప్పారు. ఉత్తరాది, దక్షిణాదిగా విభజించి ప్రయోజనం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శలు చేశారు. ఈ విధానం మంచిదికాదని ఆయన చెప్పారు. దక్షిణాది మద్దతు లేకుండా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎలా మారుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్ను చెల్లిస్తున్న ప్రతి రూపాయికి 40 పైసలు మాత్రమే తిరిగి వస్తోందని ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ కు ఏడు రూపాయాలు, బీహార్ కు ఆరు రూపాయాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలే పన్నుల రూపంలో ఎక్కువ చెల్లిస్తున్నాయని చెప్పారు. పన్ను పంపిణీలో 50 శాతం మెరిట్ ఉండాలని 16 ఆర్ధిక సంఘానికి తాను స్పష్టంగా చెప్పానని ఆయన గుర్తు చేశారు. మోదీకి దక్షిణాది ఓట్లు, డబ్బు కావాలి. కానీ, ఇక్కడి వారికి న్యాయం చేయరా అని ఆయన ప్రశ్నించారు.న్యాయం కోసం పోరాటం చేస్తాం. డీలిమిటేషన్ లో అన్యాయంతో దక్షిణాదిలో బీజేపీ కూడా నష్టపోతోందని రేవంత్ రెడ్డి చచెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కేంద్రం నుంచి న్యాయం చేయాలని ఆయన కోరారు.
డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం ఎలా?
నియోజకవర్గాల పునర్విభజలో 543 నుంచి 753కు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 80 నుంచి 126 కి పెరిగే అవకాశం ఉంది. తమిళనాడులో 39 నుంచి 41కి స్థానాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 ఎంపీ సీట్లలో ఒకటి తగ్గే ఛాన్స్ ఉంది. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న సీట్లలో కొన్ని పెరుగుతాయి. అయితే ఉత్తరాదితో పోలిస్తే ఆ పెరుగుదల నామమాత్రమేనని అంచనా.
పన్నుల ఆదాయంలో దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందా?
కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ వాదనను బీజేపీ సర్కార్ తోసిపుచ్చుతోంది. రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం తిరిగి రాష్ట్రాలకు పంచుతారు. అయితే ఈ నిధుల కేటాయింపునకు పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారంగా నిధుల కేటాయింపు కోసం ప్రతి ఐదేళ్లకు ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్ సిఫారసుల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపకం జరుగుతోంది. రాష్ట్రాల విస్తీర్ణం, జనాభా, అత్యల్ప తలసరి ఆదాయం, అటవీ, పర్యావరణం, పన్ను వసూళ్లలో రాష్ట్రాల సామర్ధ్యం ఉన్న రాష్ట్రానికి అధిక నిధులు, జనాభా నియంత్రణలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా నిధులు పంచుతారు. కేరళ,తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ మేరకు జరగలేదని నివేదికలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం రావడం లేదని ఆరోపించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.