Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి వ్యూహం
Revanth Reddy: పాల్వాయి స్రవంతి కోసం పట్టుదలగా పనిచేస్తున్న రేవంత్
Revanth Reddy: మునుగోడు ఎన్నికను టీ-కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజూరాబాద్ ఎన్నిక వేరు.. మునుగోడు వేరు అని నిరూపించుకోవాల్సిన ఒత్తిడిని రేవంత్ అండ్ టీమ్ ఎదుర్కొంటోంది. ఏమాత్రం నెగెటివ్ రిజల్ట్ వచ్చినా.. అది తరువాత ప్రభావం చూపిస్తుందన్న అవగాహనతోనే రేవంత్ ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. అందుకోసం మునుగోడు గ్రౌండ్ లెవెల్లో రేవంత్ కొన్ని కీలకమైన చేంజెస్ చేస్తున్నారు. మరి ఆ చేంజెస్ ఏంటి?
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీ-కాంగ్రెస్ వ్యూహం మార్చింది. అధికార పార్టీలకు భిన్నంగా రేవంత్ రెడ్డి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మునుగోడులో ఉన్న 7 మండలాలకు సీనియర్ నేతలను ఇంచార్జ్ లుగా నియమించి వారికి ఇద్దరిద్దరు సహఇంచార్జ్ లను కూడా కేటాయించారు. స్ట్రాటజీలో భాగంగా మన మునుగోడు-మన కాంగ్రెస్, గడప గడపకు కాంగ్రెస్.. వంటి పేర్లతో ఓటర్లను నేరుగా కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడే అనుకున్న విధంగా పని జరగడం లేదని పీసీసీ చీఫ్ గుర్తించినట్లు సమాచారం. కొంతమంది సీనియర్ నేతలు, మండలాల ఇంచార్జ్ లు ఇంతవరకు మునుగోడు మొహం కూడా చూడలేదు. మరికొంత మంది అక్కడ ప్రచారంలో కనిపిస్తున్నా... ప్రజల సమీపంలోకి వెళ్లి ఓటరును కలవడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఇబ్బంది ఒకటైతే.. మరోవైపు సీనియర్ నేతలందరికీ మునుగోడులోనే బాధ్యతలు వేయడం వల్ల భారత్ జోడోయాత్రకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా పీసీసీ భావిస్తోంది. దీంతో మండల ఇంచార్జ్ లుగా ఉన్న సీనియర్లను వెనక్కి పిలిచి వారి ప్లేసులో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా వెనక్కి పిలిచినవారికి.. ఇదీ మీ పని తీరుకు నిదర్శనం.. ఇకనైనా గుర్తించారా అనే మెసేజ్ కూడా ఇచ్చినట్టు ఉంటుందని పీసీసీ భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా.. ఇంచార్జుల ప్రక్షాళన కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే టీ-పీసీసీ షురూ చేసిందంటున్నారు.
పార్టీ కోసం పని చేసినవారికే పదవి అనే స్కీము కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితుల్లో వినూత్నంగానే కనిపిస్తున్నా.. మండల ఇంచార్జులను మార్చి యువ నేతలకు బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఫలితాలు ఎంతవరకు వస్తాయనేది వేచి చూడాల్సిందే.