నేడు టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: భారీ ఏర్పాట్లతో కొత్త శోభ సంతరించుకున్న గాంధీభవన్‌ * ఉ.10 గంటలకు పెద్దమ్మ తల్లి గుడిలో పూజలు

Update: 2021-07-07 01:40 GMT

ఈరోజు టీపీసీసీ చీఫ్ గా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: కాంగ్రెస్‌లో కొత్త ట్రెండ్ మొదలవబోతుంది. కద్దర్‌ కార్యకర్తలకు నయా జోష్‌ వచ్చింది. గాంధీ భవన్‌ కొత్తగా కనిపిస్తోంది. కొత్త బాస్‌గా రేవంత్‌ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్ననడంతో... హస్తం పార్టీలో ఆనందం వెల్లువెత్తుతుంది. అయితే తనకు అవకాశం వచ్చినా... వెంటనే, పదవి భాద్యతలు చేపట్టకుండా రేవంత్‌ పదిరోజుల పాటు సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో సీనియర్లను... జూనియర్లను ఒక్కతాటిపై తెచ్చే ప్రయత్నాలు చేశారు. మరి రేవంత్‌ ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి..? శ్రేణుల్లో జోష్‌ నింపి... పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ నయా బాస్‌ ఇవాళ ఎలాంటి ప్రకటన చేయనున్నారు?

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్‌లో రేవంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వాస్తు నిపుణుల సూచనల మేరకు గాంధీ భవన్​లో పలు మార్పులు చేశారు. ఇప్పటికే భవనానికి రంగులు వేశారు. ఫ్లోరింగ్ వేయటంతో చెట్లను ట్రిమ్ చేశారు. ఈ మార్పులతో గాంధీ భవన్‌కి కొత్త లుక్‌ వచ్చింది.

ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్​లోని పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11 గంటలకు నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి గాంధీ భవన్​కు ర్యాలీగా బయల్దేరుతారు. మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరిస్తారు. రేవంత్‌ రెడ్డితోపాటు వర్కింగ్​ప్రెసిడెంట్లు, పలు విభాగాల ఛైర్మన్లు, సీనియర్​ ఉపాధ్యక్షులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణ అనంతరం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనున్నారు.

మరోవైపు తన బాధ్యతల స్వీకారానికి రావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. బాధ్యతల స్వీకరించేలోపు రేవంత్​రెడ్డి పార్టీ సీనియర్లను కలిశారు. ప్రతీ ఒక్క నేతతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు, రాజకీయాలు.. మరీ అలాంటి పార్టీలో అందరికీ స్నేహహస్తం ఇస్తున్నారు... పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని సీనియర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మర్రి శశిధర్​రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబును కూడా కలిశారు. మరోవైపు కర్ణాటక వెళ్లి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, అక్కడి పీసీసీ అధ్యక్షుడు డి.కే శివకుమార్ ఆహ్వానించారు. ఇలా అందరి కలుపుకుంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే ధ్యేయంగా రేవంత్‌ ముందుకు వెళ్తున్నారు. ఇక నూతన పీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. గాంధీ భవన్ ప్రాంగణంలో, వెలుపల రేవంత్​ రెడ్డికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేవంత్​రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాల నుంచి కాంగ్రెస్​ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇవాళ జరగబోయే తన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన ఏమైనా చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర ఒక్కటే మార్గమని ఆయన భావిస్తున్నారట. తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ కార్యక్రమంలోనే ఇందుకు సంబంధించి ప్రకటన చేయడమో లేక ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వడమో చేయొచ్చని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

Full View


Tags:    

Similar News