రోడ్లపై కుప్పకూలిన మనుషులు.. నురగలు కక్కుకుని ప్రాణాలు విడిచిన పశువులు, పక్షులు. ఫుట్ పాత్, కాలువ, రోడ్డు, ఇల్లు, గుడి ఎక్కడ చూసిన శ్వాస ఆడక కళ్లు తేలేసిన జనం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు చివరకు చెట్లపై పూలు కూడా నల్లగా కమిలిపోయిన విషాదదృశ్యాలు ఇప్పుడు భాగ్యనగరవాసులను భయపెడుతున్నాయి. ప్రకృతి ప్రకోపంతో కొన్ని జరుగుతుండగా మానవ తప్పిదాలతో జరిగే మరికొన్ని ఘటనలు కలవరపెడుతున్నాయి. భోపాల్ గ్యాస్ లీకేజీని కళ్ల ముందు నిలిపిన భయకర ఘటన ఇప్పుడేందుకు టెన్షన్ పెడుతుందో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే.
ఆయువులు తీసిన వాయువులు. భోపాల్ గ్యాస్‌ను తలపించిన విశాఖ ఘటన. జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసిన విషవాయులు.
విశాఖ గ్యాస్ లీకేజీకి భోపాల్ గ్యాస్ ఘటనతో పోలికలు ఉండటంతో హైదరాబాద్ వాసులు ఉలిక్కి పడుతున్నారు. నగరంలో నివాసాల మధ్య పరిశ్రమలు ఉండడమే ప్రజలను మరింత భయపెడుతోంది. ప్రమాదకర పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీలుగా గుర్తించి రెడ్ కేటగిరీలో ఉన్న వాటిని ఔటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలన్న ప్రతిపాదన గత దశాబ్దకాలంగా ఉన్నా ప్రభుత్వాలు మారుతున్నా ప్రమాదకర పరిశ్రమలు మాత్రం నగరం మధ్యలో నుంచి తరలిపోకపోవడంతో ఇప్పుడు టెన్షన్ పెంచుతోంది.
గ్రేటర్ పరిధిలో ఉన్న పలు పారిశ్రామిక వాడలు భయంకరమైన కాలుష్యపు కొరల్లోకి నెట్టేస్తోంది. జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, నాచారం, మల్లాపూర్ వంటి ప్రాంతాల్లో రసాయన, ఫార్మా, బల్క్ డ్రగ్ వంటి కంపెనీలతో ముప్పు పొంచి ఉంది. లాక్‌డౌన్ కారణంగా దాదాపు 50 రోజులుగా ఆయా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. భాగ్యనగరంలో ఇన్ని రోజుల పాటు మూసి ఉంచిన పరిశ్రమల్లో సరైన పద్ధతుల్లో నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నెలల తరబడి పరిశ్రమలను మూసేసినప్పటికీ క్రమం తప్పకుండా గ్యాస్, లిక్విడ్ స్టోర్ చేసే కంపెనీలు రియాక్టర్లను జాగ్రత్తగా చూసుకోవాలి. రియాక్టర్లు, వాల్స్, కంట్రోలింగ్ పైపులు, ఎప్పటికప్పు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కార్యకలాపాలు ప్రారంభించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా విశాఖలో జరిగిన ఘటనే పునరావృతం కావచ్చని రసాయన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకర రసాయనాల వాడకంలో అప్రమత్తంగా లేకపోతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో విశాఖలో జరిగిన ఘటనే నిదర్శంగా మారనుంది.
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఫార్మా, బల్క్‌డ్రగ్ కంపెనీలు 250 ఉండగా, అందులో సగాని కంటే ఎక్కువ పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపలే ఉన్నాయి. అధికారులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేటప్పుడు చూపుతున్న శ్రద్ధ ఆ తర్వాత వాటి నిర్వహణ ఎలా ఉందన్నదానిపై చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కెమికల్ కంపెనీలో రియాక్టర్లు, ఇతర మిషన్లు రెగ్యులైజ్ కండిషన్‌లోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యతాక్రమంలో ప్రారంభించాలి. లేకుంటే వైజాగ్‌లో ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ఏ విధంగా విష వాయువులు బయటకు వచ్చాయో అదే విధంగా పునరావృతాయని హెచ్చరిస్తున్నారు.