Remdesivir Injections: డాక్టర్ నిర్వాకం..రెమ్ డెసివర్ బాటిల్ లో సెలైన్ వాటర్..
Remdesivir Injections: నిజామాబాద్ జిల్లాలో ఒక్క రోజులో మూడు చోట్ల రెమ్ డిసీవర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్
Remdesivir Injections: నిజామాబాద్ జిల్లాలో రెమీడెసీవర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ దందాపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. రెమ్ డెసివర్ ఇంజక్షన్ పేరిట ఖాళీ బాటిల్ లో సెలైన్ వాటర్ నింపి విక్రయించిన డాక్టర్ లైసెన్స్ రద్దుకు సిఫార్సుచేయనున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పక్కదారి పట్టిన ఇంజక్షన్ ల వ్యవహారంలో ఇంటి దొంగలను పట్టుకునేందుకు అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు.
నిజామాబాద్ జిల్లాలో ఒక్క రోజులో మూడు చోట్ల రెమ్ డిసీవర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ. పట్టుబడ్డ వైనంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రెమ్ డెసివర్ ఇంజక్షన్ ఖాళీ బాటిల్ లో సెలైన్ వాటర్ నింపి బ్లాక్ లో 30వేలకు విక్రయించిన ఘటనలో ప్రైవేట్ డాక్టర్ సాయి కృష్ణమ నాయుడు, కంపౌడర్ సతీష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ రెమ్ డెసివర్ ఇంజక్షన్ విక్రయాలపై విచారణకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీలు చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వాడి పారేసిన రెమ్ డెసివర్ ఖాళీ బాటిల్ లో సెలైన్ వాటర్ నింపి అమ్మకాలు చేసినట్లు గుర్తించారు. విచారణ నివేదికను కలెక్టర్ కు అందించిన తర్వాత చర్యలు ఉంటాయని డి.ఎం.హెచ్.ఓ. చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి రెమ్ డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుండగా ఓ నర్సుతో పాటు ఆమె భర్తను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు నిఘా వేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నర్సు స్రవంతిని విధుల నుంచి తొలగించిన అధికారులు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి రెమ్ డెసివర్ ఇంజక్షన్లు పక్కదారి పడుతున్న వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టారు. నకిలీ మందుల అమ్మకం, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన రెమ్ డెసివర్ బ్లాక్ మార్కెట్ దందాపై రాష్ట్ర స్దాయి విజిలెన్స్ బృందం దృష్టి పెట్టింది.