వామన్‌రావు దంపతుల హత్యకు కారణాలేంటి..?

Vaman rao: లుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాదుల జంట హత్యలకు ముందు ఏం జరిగింది

Update: 2021-02-18 14:34 GMT
వామాన్ రావు (ఫోటో ది హన్స్ ఇండియా)

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాదుల జంట హత్యలకు ముందు ఏం జరిగింది..? వామన్‌రావు దంపతులను కావాలనే ప్రత్యర్థులు అడ్డు తొలగించుకున్నారా..? గుంజపడుగులోని కుల దేవత గుడి వివాదమే న్యాయవాదుల హత్యలకు కారణమా?

పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణి వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కుంట శ్రీనును పోలీసులు అరెస్ట్ చేసి విచారణను వేగవంతం చేశారు. అయితే అసలు ఈ జంట హత్యలకు కారణం ఏమిటనే దానిపై అనేక ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని కుల దేవత గుడి వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు వామన్ రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంటా శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు.

ఈ క్రమంలో అతడి కాల్ డేటాను విశ్లేషించగా గుడి కూలితే వామనారావు కూలిపోతాడు అని శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో క్లిప్ కీలకంగా మారింది. కుంటా శ్రీనివాస్ సింగరేణి కార్మిక సమాఖ్యలో పనిచేశాడని పోలీసులు వెల్లడించారు. గట్టు వామన్ రావు మంథనిలో జరిగే అనేక అక్రమాలపై హైకోర్టులో ఇప్పటికే చాలా కేసులు వేసి కొన్ని గెలిచాడు. ఇది మింగుడు పట్టక తమ పనులకు అడ్డుగా ఉన్నాడనే నేపథ్యంలో పక్కా ప్లాన్‌తో అదును చూసి రాజకీయ అండదండలతో వేటకొడవళ్లు, కత్తులతో నిందితులు వామన్ రావును మట్టుబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ రేవంత్ రెడ్డి, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే చంపేశారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్‌రావు హత్య వెనుక టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారన్న రేవంత్.. ఈ హత్య కేసులో స్థానిక టీఆర్ఎస్ నేతలు కేవలం పాత్రధారులే అన్నారు.

వామన్ రావు దంపతులను హత్య చేసిన ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తేల్చిన పోలీసులు ఇప్పటికే కుంటా శ్రీనివాస్‌ సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక వామనరావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ -1 గా వసంతరావు, ఏ -2 గా కుంట శ్రీనివాస్, ఏ -3 గా అక్కపాక కుమార్‌ను పేర్కొన్నారు. 

Tags:    

Similar News