తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ ట్వీట్ చేసిన కేటీఆర్
Raksha Bandhan 2022: తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి నెలకొంది. ఇంటింటా సోదరీసోదరులు రాఖీలు కట్టుకుంటూ సందడి చేస్తున్నారు.
Raksha Bandhan 2022: తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి నెలకొంది. ఇంటింటా సోదరీసోదరులు రాఖీలు కట్టుకుంటూ సందడి చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు రాఖీ వేడుకల్లో సందడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు సోదరి కవిత రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చెల్లె కవితతో పాటు తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేశారు. కూతురు అలేఖ్య.. కుమారుడు హిమన్షుల ఫోటోలను ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు విషెస్ చెప్పారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటికి తరలివచ్చి సందడి చేశారు. మంత్రి హరీష్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని, రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
రక్షాబంధన్‌ను పురస్కరించుకుని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, అక్కలు అనసూయమ్మ, సుదర్శనమ్మ, పద్మమ్మ, చెల్లెల్లు శశిరేఖ రాఖీ కట్టారు. అడపడుచులకు మంత్రి నిరంజన్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
రక్షా బంధన్ సందర్బంగా క్యాంపు కార్యాలయంలో అక్కలు, చెల్లెలతో మంత్రి మల్లారెడ్డి రాఖి కట్టించుకున్నారు. నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.