Rains: తెలుగురాష్ట్రాల్లో రెండురోజుల పాటు విస్తారంగా వర్షాలు
Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే తెలంగాణలో ఈనెల రుతుపవనాలు ప్రవేశించగా రెండు రోజులుగా రాష్ట్రంలో ఆయా చోట్ల వర్షాలు కురిశాయి. ఈ రుతుపవనాలు గురువారం రాష్ట్రమంతటా వ్యాపించగా నిన్న సాయంత్రం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గరువారం కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌లో 9, సిద్ధిపేటలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇక ఇవాళ అల్పపీడనం ఏర్పడనుండటంతో ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు రోజుల పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు వివిధ శాఖలను అప్రమత్తం చేసింది.
అటు ఏపీలోనూ ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయి. దీనికి తోడు అల్పపీడనం కూడా ఏర్పడనుండటంతో ఉత్తర కోస్తాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ తేలికపాటి జల్లులు కురుస్తాయంది.