Rain In Hyderabad : గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడకపోవడంతో నగరాల్లో ఉష్ణోగ్రత భారీగా పెరిగింది. దీంతో నగర ప్రజలంతా కొద్ది రోజుల నుంచి ఉక్కపోతకు గురయి అతలాకుతలం అవుతున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం వరకు వేడి వేడి గా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి చల్లబడిపోయింది. ఆకస్మికంగా వాతావరణంలో మార్పులు వచ్చి వేడి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా భారీ వర్షాలు కురిశాయి. దీంతో హైదరాబాద్ నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి గురువారం మధ్యాహ్నం నుంచి పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది.
నగరంలోని ఖైరతాబాద్, ఎల్బీనగర్, హయత్ నగర్, సంతోష్ నగర్, చంపాపేట్, అంబర్‌పేట, రాంనగర్, తార్నాక, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండపూర్, మోహిదీపట్నం, లక్డికాపూల్, అసెంబ్లీ, అబిడ్స్, కోఠి, మలక్ పేట్, దిల్‌సుఖ్ నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, తార్నాక, బోయిన్‌పల్లి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట లో వర్షం కురిసింది. అదే విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. ఇటు మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసాయి. దీంతో గత 24 గంటల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34-డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గింది. ఇక పోతే భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) సెప్టెంబరు 14 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.