రేపు తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర.. హైదరాబాద్ మీటింగ్‌కు సోనియా, ప్రియాంక గాంధీ..?
Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.. రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది.
Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.. రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రేపు ఉదయం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. ఉదయం 10 గంటలకు కర్ణాటక సరిహద్దులో ఉన్న గూడబెల్లూరులో ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభం కానుంది. రాహుల్ పాదయాత్రను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్‌ను ఫైనల్ చేసిన లీడర్లు పాదయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో జోడో యాత్ర సుదీర్ఘంగా సాగనుంది. మొత్తం 16 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్ర మొత్తం 19 అసెంబ్లీ నియోజవర్గాల గుండా సాగనుంది. అందులో 7 పార్లమెంట్ నియోజకవర్గాలను కూడా కవర్ చేయనున్నారు. మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ నడవనున్నారు. వచ్చే నెల 7 వరకు జరగనున్న ఈ యాత్రకు దీపావళి సందర్భంగా మూడు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. అలాగే నవంబర్ 4న కూడా యాత్రకు ఒకరోజు బ్రేక్ పడనుంది. రోజూ 20 నుంచి 25 కిలోమీటర్ల మేర రాహుల్ నడవనున్నారు. రాహుల్‌తో పాటు పలు చోట్ల ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొననున్నారు. అలాగే కార్నర్ మీటింగుల పేరుతో చాలాచోట్ల ప్రజలతో ఇంటరాక్ట్ కానున్నారు. హైదరాబాద్‌లో కూడా ఒకరోజు ఉండనున్నారు. నెక్లెస్ రోడ్డులో మీటింగ్‌లో మాత్రం సోనియా, ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారతజాతి సమైక్యతా నినాదంతో తెలంగాణాలో అడుగుపెడుతున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకు టీపీసీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. పలు బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నర్ సమావేశాలలో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విదానాలను ఖరారు చేసింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు పనిచేస్తున్నాయి. అయితే మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రను విజయవంతం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లు, జూనియర్లంతా జోడో యాత్ర విజయం కోసం శ్రమిస్తున్నారు.