Ragging: ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్ కలకలం..6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యయత్నం
Ragging: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలురు ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. పదవ తరగతి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆరోవ తరగతి విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి బంధువులు, తోటి విద్యార్థులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ఆశ్రమ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు పనులు చేయాలంటూ ఆరో తరగతి విద్యార్థిని తరచుగా వేధిస్తుండేవారు. కొడుతుండేవారు. ఆ బాధను తట్టుకోలేక ఆ విద్యార్థి ఎలర్జీ నివారణకు వాడే మందును తాగాడు.
ఇది గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వారు ఆ బాలుడిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నామని 24గంటల తర్వాత ఆరోగ్య పరిస్థితి చెబుతామని వైద్యులు వెల్లడించారు. 10వ తరగతి విద్యార్థులు వేధిస్తున్న విషయం వార్డెనుకు తెలిపినా పట్టించుకోలేదని బాధిత విద్యార్థి తెలిపాడు. ఈ విషయమై గిరిజనాభివ్రుద్ధి శాఖ ఉపసంచాలకుడు మాలోత్ సైదానాయక్ ను వివరణ కోరారు.
గూడురు గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.