తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో కరోనా పేషెంట్ల రిపోర్టులపై మరోసారి పిటిషన్ దాఖలైంది. కరోనా బాధితులకు చేసిన టెస్టుల రిపోర్టులో CT వాల్యూను RTPCR రిపోర్ట్ లో చూపించడం లేదంటూ ప్రజా ప్రయోజన వాజ్యం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాగా ఈ పిల్ పై గురువారం రోజున హై కోర్టు విచారణ జరిపింది. ఈ దాఖలు అయిన పీల్ పై హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి విచారించారు. కొంత సేపు వాద ప్రతివాదనలు విన్న హై కోర్టు తదుపరి విచారణను ఈనెల 24 వ తేదీకి వాయిదా వేసింది. అంతే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విచారణలో భాగంగానోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయ్యింది. పలు నివేదికలను అందించాలంటూ పలుమార్లు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రతి రోజు ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలని ఇంతకు ముందు ఆదేశాలు జారి చేసింది. కానీ అవి అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక పోతే నిన్న రాత్రి 8 గంటల వరకు 53,094 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1005కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,108 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,33,555కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,674 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాల రేటు ఉండగా, రికవరీ రేటు 80.94శాతంగా ఉందని, ఇది దేశ సగటు (78.59శాతం) కంటే ఎక్కువని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 53,094 శాంపిల్స్ పరీక్షించగా, 1032 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 23,29,316 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో 318 నిర్ధారణ కాగా, తర్వాత రంగారెడ్డి 176, నల్గొండ 141, సిద్దిపేటలో 132, మేడ్చల్ మల్కాజ్‌గిరి 121, కరీంనగర్ 127, వరంగల్ అర్బన్‌లో 98 పాజిటివ్ కేసులు రికార్డు అయినట్లు వివరించింది.